అమలాపురంలో బయో మైనింగ్‌ ప్లాంట్‌

సీసీ రోడ్డు నిర్మాణ పనుల్ని పరిశీలిస్తున్న మంత్రి విశ్వరూప్‌  - Sakshi

అమలాపురం టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలో పేరుకుపోతున్న చెత్త(కంపోస్టు)ను రీసైక్లింగ్‌ చేసేందుకు రూ.1.60 కోట్లతో చెత్త శుద్ధీకరణ క్షేత్రం (బయో మైనింగ్‌ ప్లాంట్‌) నిర్మించనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. బైపాస్‌ రోడ్డు వద్ద పంట కాల్వ చెంత అటు శ్మశానానికి, ఇటు కంపోస్ట్‌ యార్డ్‌కు వెళ్లేందుకు అనువుగా రూ.85 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులతో పాటు కంపోస్టు యార్డును ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బయో మైనింగ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, కమిషనర్‌ ఒమ్మి అయ్యప్పనాయుడు, కౌన్సిలర్లు, ఇంజినీర్లతో చర్చించారు. ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని సూచించారు. ప్లాంట్‌ నిర్మాణానికి వీలుగా చెత్త గుట్టలను అక్కడి నుంచి తరలించాలని అధికారులను ఆదేశించారు. బయో మైనింగ్‌ ప్లాంట్‌ నిర్మాణంతో కంపోస్టు యార్డులో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు.

పట్టణానికి పుష్కలంగా తాగునీరు

పట్టణ ప్రజలకు రానున్న 30 ఏళ్లలో తాగునీటి సమస్యలనేవి లేకుండా రూ.20 కోట్లతో రూపొందించిన ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చే ఏడాది నుంచి పుష్కలంగా తాగునీరిస్తామని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గాంఽధీనగర్‌లో జరుగుతున్న ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ ట్యాంక్‌ నిర్మాణం రానున్న 9 నెలల్లో పూర్తవుతుందన్నారు. ఏవీఆర్‌ నగర్‌, హెచ్‌బీ కాలనీల్లో మరో రెండు ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణాలకు సైతం స్థలాలు సిద్ధం చేయాలని కమిషనర్‌ నాయుడును ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తిక్కిరెడ్డి వెంకటేష్‌, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, మున్సిపల్‌ కౌన్సిలర్లు కొల్లాటి దుర్గాబాయి, చిత్రపు రామకృష్ణ, డీఈఈ కె.అప్పలరాజు, ఏఈ హేమంత్‌ కమల్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు కముజు రమణ, రాజీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చెత్త సమస్యకు రూ.1.60 కోట్లతో శాశ్వత పరిష్కారం

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

పినిపే విశ్వరూప్‌




 

Read also in:
Back to Top