3,421 మందికి గౌరవ వేతనం

జగ్గంపేట: రాష్ట్రంలో రెండో విడతగా 3,421 మంది పాస్టర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం మంజూరు చేసిందని రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లవరపు జాన్‌వెస్లీ తెలిపారు. యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ జగ్గంపేట ఆధ్వర్యాన మంగళవారం జగ్గంపేటలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకు, పార్టీలకు అతీతంగా నవరత్న పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నవరత్నాల వల్ల రాష్ట్రంలోని లక్షా 25 వేల మంది క్రైస్తవులకు రూ.250 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. అర్హులైన వారికి జెరూసలెం యాత్రకు అనుమతిస్తున్నారని తెలిపారు. దీని కోసం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రూ.60 వేలు, ఎగువన ఉన్నవారికి రూ.30 వేలు మంజూరు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే 3 బృందాలు జెరూసలెం యాత్రలో ఉన్నాయన్నారు. క్రైస్తవుల బరియల్‌ గ్రౌండ్‌ సమస్యకు సీఎం త్వరలో పరిష్కారం చూపనున్నారని చెప్పారు.




 

Read also in:
Back to Top