గల్ఫ్‌ పంపుతానని మోసం.. ఒకరిపై కేసు

పి.గన్నవరం: గల్ఫ్‌ పంపుతానని డబ్బులు కాజేసి, మోసగించిన వ్యక్తిపై పి.గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పి.గంగాభవాని కథనం ప్రకారం.. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంకకు చెందిన కంఠంశెట్టి రమేష్‌ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఐదేళ్ల పాటు మస్కట్‌లో పని చేశాడు. ఏడాది క్రితం అతడు మళ్లీ గల్ఫ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామానికి చెందిన కుడుపూడి సూర్యనారాయణమూర్తి గల్ఫ్‌ ఏజెంటుగా పరిచయమయ్యాడు. రమేష్‌ను గల్ఫ్‌ పంపేందుకు రూ.65 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా రమేష్‌ రూ.30 వేలు చెల్లించాడు. ఆరు నెలలు దాటినా ఏజెంట్‌ గల్ఫ్‌ వీసా ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన రమేష్‌కు ఆరా తీయగా, తన మాదిరిగానే వివిధ గ్రామాలకు చెందిన మరో 19 మంది నుంచి సూర్యనారాయణమూర్తి డబ్బులు తీసుకుని మోసగించాడని తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రమేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు ఏజెట్‌ సూర్యనారాయణమూర్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గంగాభవాని తెలిపారు.




 

Read also in:
Back to Top