స్పందనకు 200 అర్జీలు

ఎస్పీ కార్యాయానికి వచ్చిన అర్జీదారులు  - Sakshi

అమలాపురం రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై 200 మంది అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విన్నారు. ఆయా అర్జీలకు నిబంధనలకు లోబడి నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారా లు చూపాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కార సరళిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి వారం సమీక్షిస్తున్నారని చెప్పారు. సామాజిక భద్రతా పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డుల మంజూరు, భూ సమస్యలు తదితర అంశాలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయని తెలిపారు. గ్రామ స్థాయి సమస్యలపై ఆయా సచివాలయాల్లోను, మండల స్థాయి సమస్యలపై సంబంధిత మండల కార్యాలయాల్లోను జరిగే స్పందన కార్యక్రమాల్లో అర్జీలు సమర్పించాలని, జిల్లా స్థాయి సమస్యలపై కలెక్టరేట్‌ స్పందనకు రావాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వైద్యులకు సత్కారం

తనకు రెండు కళ్లూ కనిపించడం లేదని, సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేసి, దివ్యాంగ పింఛను ఇప్పించాలని రాజోలు మండలం పోలవరానికి చెందిన కడలి శ్రీనివాస్‌ ఇటీవల వైద్యులను కోరారు. ఆయనకు వైద్యులు వి.అశోక్‌ కుమార్‌, వి.హేమలత పి.సమీర కంటి పరీక్షలు నిర్వహించి, వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా శస్త్రచికిత్స చేశారు. దీంతో అతడికి చూపు వచ్చింది. శ్రీనివాస్‌ రెండో కంటికి కూడా త్వరలో శస్త్రచికిత్స చేసి, పూర్తి స్థాయిలో కంటిచూపును రప్పించేందుకు కృషి చేస్తున్న వైద్యులను స్పందన హాలులో కలెక్టర్‌ సత్కరించారు.

పోలీసు స్పందనకు 35 అర్జీలు

అమలాపురం టౌన్‌: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు స్పందన కార్యక్రమానికి 35 అర్జీలు వచ్చాయి. ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులు ఆస్తి తగదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందజేశారు. కొన్ని సమస్యలను ఎస్పీ అక్కడిక్కడే పరిష్కరించి, ఆయా పోలీసు స్టేషన్ల ఎస్సైలతో మాట్లాడారు. కుమార్తె అనారోగ్యం దృష్ట్యా అమలాపురం గొల్లగూడెంలోని తన స్థలాన్ని అమ్ముకుందామంటే బంధువులే అడ్డుకుంటున్నారని రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నకిలీ విల్లు తయారు చేసి, స్థలాన్ని కొనుగోలు చేసుకునేందుకు వచ్చిన వారిని భయపెడుతున్నారని చెప్పారు. ఆరుద్ర దివ్యాంగురాలైన తన కుమార్తెను వీల్‌ చైర్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకు వచ్చి మరీ ఫిర్యాదు చేశారు.




 

Read also in:
Back to Top