వర్షంతో ఉపశమనం

దివ్యాంగుడు శ్రీనివాస్‌కు ఆర్థిక సాయం 
అందజేస్తున్న పూర్వ విద్యార్థులు   - Sakshi

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా రబీ రైతులకు ఉపశమనం కలిగించేలా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పంటలకు మేలు చేసింది. ఆదివారం ఉదయం అడపాదడపా చినుకులు పడి వాతావరణం చల్లబడింది. జిల్లాలో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకూ సగటున 32.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అత్యధికంగా అమలాపురంలో 81.2 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా రావులపాలెంలో 8.6 మిల్లీ మీటర్లు పడింది. సఖినేటిపల్లి 79.4, రాజోలు 64.4, అల్లవరం 46.6, మామిడికుదురు 46.6, కాట్రేనికోన 40.6, మలికిపురం 40, ఉప్పలగుప్తం 35.2, ముమ్మిడివరం 30.2, ఐ.పోలవరం 29.4, అంబాజీపేట 27.8, పి.గన్నవరం 23.8, రాయవరం 20.2, కపిలేశ్వరపురం 19.8, మండపేట 18.0, రామచంద్రపురం 14.6, కొత్తపేట 14.2, ఆత్రేయపురం 9.4, ఆలమూరు 9.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రబీ నీటి ఎద్దడి సమస్య తీరేలా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ అరకొర నీటితో ఇబ్బంది పడగా, వర్షంతో మరో వారం పది రోజులు నీటికి ఇబ్బంది లేదని చెబుతున్నారు. శివారు, మెరకలకు నీటి సరఫరా ఒత్తిడి తగ్గుతోందని ఇటు ఇరిగేషన్‌ అధికారులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.

పూర్వ విద్యార్థుల ఔదార్యం

మండపేట: బాల్య మిత్రునికి అండగా నిలిచి పూర్వ విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రథం స్కూల్‌కు చెందిన 1987–88 బ్యాచ్‌ విద్యార్థులు తాము ఏర్పాటు చేసుకున్న ప్రియమిత్ర సంఘం ద్వారా ఆర్థిక చేయూతను అందించారు. పట్టణానికి చెందిన కోటిపల్లి శ్రీనివాస్‌ దివ్యాంగుడు. దీనికితోడు పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురై తీవ్ర అనారోగ్య, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. అతని దీనస్థితి తెలుసుకుని చలించిన పూర్వ విద్యార్థులు రూ. 1.51 లక్షలను సేకరించి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రియమిత్ర సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది బోన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న చిన్నారికి రూ.1,30,555 ఇచ్చామన్నారు.

లోవలో భక్తుల సందడి

తుని రూరల్‌: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం ఎనిమిది వేల మంది దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. రవ్వలడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.76.875, పూజా టికెట్లకు రూ.30,420, కేశఖండన శాలకు రూ.3,775, వాహన పూజలకు రూ.4,190, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెల రూపేణా రూ.68,900, విరాళాలుగా రూ.70,334 కలిపి మొత్తం రూ.2,54,494 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు అవసరమైన సదుపాయాలను చైర్మన్‌ గొర్లి అచ్చియ్యనాయుడు, సిబ్బందితో కలసి ఈఓ విశ్వనాథరాజు పర్యవేక్షించారు. వర్షం కారణంగా ఆరుబయట చెట్ల కింద వంటలు, భోజనాలు చేసే భక్తులు ఇబ్బందులు పడ్డారు.




 

Read also in:
Back to Top