మమ్మీ అక్కలకు ఉయ్యాల కట్టింది.. నేనేమో చీర పట్టుకుని కూర్చున్నా

Tragedy In Yadadri Bhuvanagiri Disrtict - Sakshi

కుటుంబాన్ని పోషించే దారి లేక 

తాను ప్రాణాలు తీసుకున్న ఓ తల్లి

మద్యానికి బానిసైన భర్త ఒకవైపు.. ఆర్థిక కష్టాలు మరోవైపు ఇద్దరు కూతుళ్లు మృతి.. 

ఉచ్చు బిగుసుకోకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ మూడేళ్ల చిన్నారి 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఘటన 

మమ్మీ ఉయ్యాల కట్టింది.. ‘అక్కలను, నన్ను ఆడించేందుకు మమ్మీ ఉయ్యాల కట్టింది. పెద్దక్కకు ముందుగ, తర్వాత చిన్నక్కకు చీర చుట్టింది. తర్వాత మమ్మీ నాకు చీర చుట్టి ఆమెకూ చుట్టుకుంది. నేను చీర పట్టుకుని కూర్చున్న. మమ్మీ, అక్కలు ఊరికి పోయారు’అని మూడేళ్ల చిన్నారి శైనీ వచ్చీరాని మాటలతో చెబుతుంటే అక్కడున్న వారంతా కన్నీరు ఆపుకోలేకపోయారు. 

చౌటుప్పల్‌: మద్యానికి బానిసైన భర్త వేధింపులను ఆ ఇల్లాలు భరించలేకపోయింది. కుటుంబ బాధ్య తలు మరిచి జులాయిలా తిరుగుతుంటే తట్టుకోలేకపోయింది. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో చావే శరణ్యం అనుకుంది. తాను చనిపోతే ముగ్గురు కూతుళ్లు అనాథలవుతారని, వారు తనలాగే కష్టాలు పడొద్దని తనతో పాటే వారిని కూ డా తీసుకెళ్లాలనుకుంది. కూతుళ్లకు ఉరివేసి తానూ ఉరేసుకుంది. ఆమె, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దగా, చీర బిగుసుకోకపోవడంతో మూడేళ్ల చిన్న కుమార్తె ప్రాణాలు దక్కించుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గురు వారం చోటుచేసుకుంది.

రాంనగర్‌ కాలనీకి చెంది న తొర్పునూరి వెంకటేశానికి చౌటుప్పల్‌కే చెందిన ఉమారాణి (31)తో 15 ఏళ్ల కింద వివాహమైంది. వీరికి హర్షిణి(12), లాస్య (8), శైనీ (3) కూతుళ్లు ఉన్నారు. వెంకటేశం ఆటో ద్వారా మంచినీరు సరఫరా చేసేవాడు. అయితే కొన్నేళ్లుగా మద్యానికి బానిసై, పని మానేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. మద్యానికి డబ్బులు కావా లంటూ భార్యను వేధిస్తుండేవాడు. కుటుంబం గడవడం కోసం ఉమారాణి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. వెంకటేశం  తరచూ గొడవలు పడుతుండేవాడు. 

కూతుళ్లకు కష్టాలు వస్తాయని.. 
మారని భర్త వ్యవహారం, కుటుంబ పరిస్థితి తలుచుకొని నిత్యం రోదించే ఉమారాణి.. చివరకు చనిపోవాలని నిర్ణయించుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముందుగా ఇద్దరు కూతుళ్లకు వంటింట్లో పైకప్పుకు ఉన్న ఇనుప రాడ్డుకు చీరలతో ఉరేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకుని, శైనీకి ఒకవైపు చీర బిగించి మరో వైపు తాను బిగించుకుంది. అక్కడున్న ఓ బండపై నుంచి కిందకు దూకింది. ఆ సమయంలో తల్లి కిందికి రాగా, చిన్నారి మాత్రం ఒక్కసారిగా పైకప్పు వరకు వెళ్లింది. చీర మెడకు బిగుసుకోకపోవడంతో ఆ చిన్నారి బతికిపోయింది.

చిన్నారి ఏడవటంతో.. 
పాల ప్యాకెట్‌ కొనేందుకు ఆమె తోటి కోడళ్లు ఉమారాణి దుకాణానికి గురువారం ఉదయం 6 గంటలకు వెళ్లగా, ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపులు వినిపించాయి. దీంతో వెంటనే పక్కనే వారి అత్తగారింటి ముందు పడుకున్న ఉమారాణి భర్త వెంకటేశ్‌ను లేపారు. ఇంటి రేకులు తొలగించి లోపలికి వెళ్లి చూడగా, ఉమారాణితో పాటు ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. చిన్నారి శైనీ మాత్రం రోదిస్తూ సజ్జపై కూర్చుని ఉంది.

సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై మానస ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన బావ మద్యానికి బానిసై వేధింపులకు గురి చేయడంతోనే తమ చెల్లి మృతిచెందిందని ఉమారాణి సోదరుడు సందగళ్ల మల్లేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోదరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top