చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి....

She Got Married And Took Money Attempt Blackmail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాట్రిమోని సైట్‌ ద్వారా పరిచయమైంది.. వెంటపడి మరీ పెళ్లి చేసుకుంది.. అంతకుముందే అతడి నుంచి రూ.6.5 కోట్లు తీసుకుంది. పెళ్లైన నెలలోపే అతడిని ఇంటి నుంచి గెంటేసి తన బాస్‌తో కలిసి ఉంటోంది... డబ్బు తిరిగి ఇవ్వమంటే రౌడీలతో బెదిరింపులకు దిగింది. ఎట్టకేలకు విషయం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) వద్దకు రావడంతో కేసు నమోదైంది. రొటీన్‌ కథలకు భిన్నంగా  చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీసీఎస్‌ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..  

నమ్మించి.. దగా చేసి.. 
బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన రవికుమార్‌కు అతడి కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూశారు. ఓ మాట్రిమోని ద్వారా జూబ్లీహిల్స్‌కు చెందిన రీనా గోర్లే అనే యువతి నుంచి ప్రతిపాదన వచ్చింది. రవికుమార్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో అతడి సోదరి పద్మజారావు ఈ పెళ్లి ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు బ్రేక్‌ పడింది. రీనా మాత్రం రవి కుమార్‌తో సంప్రదింపులు కొనసాగించి అతడి నమ్మకం పొందింది. నువ్వంటే ఇష్టమని నమ్మించింది. విషయం పెళ్లి ప్రస్తావనల వరకు తీసుకువెళ్లింది. 

వివాహం జరగడానికి ముందే 2020 మార్చి 13న తన తండ్రి గోర్లె బాలాజీ బాబు జెట్పీటీసీగా పోటీ చేస్తున్నారని ఆ ప్రచారం కోసమంటూ రవి కుమార్‌ నుంచి రూ.2 లక్షలు, తన సోదరుడు గోర్లె అనిల్‌ ప్రసాద్‌కు అవసరమంటూ రూ.లక్ష తీసుకుంది. రీనాను పూర్తిగా నమ్మిన రవి అనేక ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడు. తాను సెర్వోమాక్స్‌ లిమిటెడ్‌ సంస్థలో పని చేస్తున్నానని, దాని సీఈఓ అంటూ సుధీర్‌ బొబ్బ అనే వ్యక్తిని రవికి పరిచయం చేసింది. తనకు స్నేహితుడు కూడా అయిన సుధీర్‌కు వ్యాపార నిమిత్తం ఆర్థికంగా సహాయం చేయాలని రవిని కోరింది.  

అప్పటికే రీనాను పూర్తిగా నమ్మేసిన రవి, అతడి కుటుంబ సభ్యులు ఆరు నెలల వ్యవధిలో రూ.6.5 కోట్లు రీనా చెప్పినట్లు చెల్లించారు. ఇందులో రూ.4 కోట్లు ఆర్టీజీఎస్‌ ద్వారా, రూ.2.5 కోట్లు నగదు రూపంలో రీనా చెప్పిన వారికి బదిలీ చేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న రవి– రీనాల పెళ్లి జరిగింది. అప్పటి వరకు డబ్బు కోసం అతడితో ప్రేమగా, సన్నిహితంగా ఉన్న ఆమె హఠాత్తుగా తన అసలు రంగు బయటపెట్టింది. తొలుత రవిని దూరంగా ఉంచడం మొదలెట్టింది. మార్చి 8న తన బాస్‌ సుధీర్‌తో కలిసి ఉంటానంటూ రవితో చెప్పడంతో పాటు అతడిని ఇంటి నుంచి గెంటేసింది. అప్పటి నుంచి ఆమె తన బాస్‌ సుధీర్‌తోనే కలిసి ఉంటోంది.  

ఇంట్లో సామాన్లు ధ్వంసం.. 
దీంతో కంగుతిన్న రవి ఆరా తీయగా... రీనా మిగిలిన వారితో కలిసి కుట్ర పన్ని తనను మోసం చేసి డబ్బు గుంజినట్లు గుర్తించారు. రవితో పాటు అతడి కుటుంబీకులు తమ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా రీనాపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఆమె బర్కత్‌పురలోని రవి కుటుంబీకుల ఇంటికి రౌడీలను పంపి బెదిరించడంతో పాటు ఇంట్లోని సామాన్లనూ ధ్వంసం చేయించింది. ఈ ఏడాది మార్చి 12 నుంచి 23 మధ్య పలుమార్లు ఇలానే జరిగింది.  

రవి సోదరి పద్మజారావు సీసీఎస్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ (జేసీపీ) డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు రవికి జరిగిన మోసాన్ని నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆయన ఏసీపీ బి.రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. నగదు బదిలీలపై లభించిన ఆధారాలతో సెర్వోమాక్స్‌ లిమిటెడ్,వన్‌మాజ్‌ డైనమిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలతో పాటు సుధీర్‌ బొబ్బ, రీనా గోర్లే, రఘు, ప్రసాద్, వెంకట్‌ దొమ్మేటి, సజిత్‌ వీకే, అనిల్‌ పారపూడిలపై ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

(చదవండి: మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top