విడిపించేందుకు వెళ్లి.. ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు 

RTC Conductor Assassination In Proddatur - Sakshi

ప్రొద్దుటూరులో ఆర్టీసీ కండక్టర్‌ హత్య  

ప్రొద్దుటూరుక్రైం(వైఎస్సార్‌ జిల్లా): పక్కింటి వాళ్లు గొడవ పడుతున్నారు.. అరుపులు వినిపించడంతో  ఆ వ్యక్తి ఇదద్దరికి సర్ది చెప్పేందుకు ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. చిన్న విషయానికి ఎందుకు గొడవపడతారని నచ్చచెబుతూ విడిపించే ప్రయ త్నం చేయగా.. ఒక వ్యక్తి కట్టెతో తలపై కొట్టగా పాపం అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పట్టణంలోని వైఎంఆర్‌ కాలనీలో కొమ్మిరెడ్డి శివశంకర్‌రెడ్డి (52) హత్యకు గురయ్యాడు. త్రీ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు.. వైఎంఆర్‌కాలనీకి చెందిన శివశంకర్‌రెడ్డి జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య ఉమామహేశ్వరి, వినోద్‌కుమార్‌ అనే కుమారుడు, హిమజ అనే కుమార్తె ఉన్నారు.

కుమారుడు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వైఎంఆర్‌ కాలనీలోని అరవిందనగర్‌లోని ఒక ఇంట్లో సురేంద్రాచారి చెక్క పని చేస్తున్నాడు. పని చేస్తున్న సమమంలో పక్కనే ఉన్న పసుపుల సుబ్బరాయుడుకు చెందిన కుక్క అతన్ని చూసి మొరగింది. దీంతో సురేంద్రాచారి రాయి తీసుకొని కుక్కపై విసిరగా సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు తగిలింది.

దీంతో అక్కడ కొంత సేపు వాగ్వా దం చోటు చేసుకుంది. తిరిగి రాత్రి ఈ విషయమై సురేంద్రాచారి, సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు గొడవ పడుతున్న సమయంలో వారి ఇంటి  సమీపంలో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌ శివశంకర్‌రెడ్డి విడిపించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి కట్టె తీసుకొని శివశంకర్‌రెడ్డి తలపై కొట్టగా అతను ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. వెంటనే చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డీఎస్పీ ప్రసాదరావు, సీఐ గంటా సుబ్బారావు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు    
విషాదం: స్టౌని అలాగే ఉంచి అగ్గిపుల్లతో వెలిగించడంతో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top