మూడు హత్యలు.. నిజాలు వీడిన మిస్టరీలు

Police Revealed Three Deceased Cases Ministries In Hyderabad - Sakshi

ఏప్రిల్‌ ఫస్ట్‌.. మూడు హత్యలతో నగరం ఉలిక్కిపడింది. వివిధ ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వెంటనే పోలీసు అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌లో రిఫ్రిజిరేటర్‌లో మహ్మద్‌ సిద్ధిఖ్‌ అహ్మద్‌ మృతదేహం మిస్టరీ వీడింది. భార్య అంగీకారంతోనే ప్రియుడు అలీ హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లిలో నడిరోడ్డుపైనే రౌడీషీటర్‌ అసద్‌ఖాన్‌ హత్య జరగ్గా.. గతంలో అసద్‌ఖాన్‌ చేతిలో హత్యకు గురైన అంజత్‌ఖాన్‌ కుమారుడు యాసిన్‌ పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. చిక్కడపల్లి సూర్యానగర్‌ ప్రాంతానికి  చెందిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సద్‌నామ్‌సింగ్‌ను గొంతు కోసి చంపగా.. అతడి భార్య సమీప బంధువు నిషాంత్‌సింగ్‌ నిందితుడని పోలీసులు గుర్తించారు. అతడి కోసం ఢిల్లీ, పంజాబ్‌లో ఎనిమిది ప్రత్యేక బృందాలు వేట కొనసాగిస్తున్నాయి.  

తలాక్‌ ఇవ్వకపోవడంతో.. 
బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కార్మికనగర్‌లో గురువారం వెలుగులోకి వచ్చిన మహ్మద్‌ సిద్ధిఖ్‌ అహ్మద్‌(38) హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడి భార్యకు తెలిసే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్‌ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. కార్మికనగర్‌లోని విద్యాసాగర్‌ పాఠశాల సమీపంలో నివసించే మహ్మద్‌ సిద్దిఖ్‌ అహ్మద్‌ కూకట్‌పల్లిలో టైలరింగ్‌ చేస్తాడు. ఇతడి భార్య రుబీనా పుట్టిల్లు శ్రీరాంనగర్‌లో ఉంది. ఆ ఇంటి సమీపంలో ఉండే అలీ అనే 20 ఏళ్ల యువకుడితో ఈమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. పిల్లలు కలిగినప్పుటికీ ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ విషయం సిద్ధిఖ్‌కు కూడా తెలియడంతో వీరి మధ్య స్పర్థలు వచ్చి తరచూ ఘర్షణ పడుతుండేవారు. సిద్ధిఖ్‌ నుంచి విడాకులు(తలాక్‌) తీసుకోవాలని తనతో కలిసి జీవించాలని అలీ చెప్పడంతో ఆమె అంగీకరించింది. కొన్నాళ్లుగా తలాక్‌ కోసం ఆమె అగుడుతున్నప్పటికీ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకున్న సిద్ధిఖ్‌ అంగీకరించలేదు. తాను సిద్ధిఖ్‌ను హత్య చేసి అడ్డు తొలగిస్తానని, ఆపై ఇద్దరం కలిసి ఉందామంటూ అలీ చెప్పడంతో రుబీనా అంగీకరించింది.

ఈ పథకం అమలులో పెట్టడంతో భాగంగా రుబీనా మంగళవారం ఉదయం పిల్లల్ని తీసుకుని శ్రీరాంనగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి అహ్మద్‌ సైతం అక్కడికే వెళ్లి భోజనం చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. అతడి కదలికల్ని రుబీనా ద్వారా తెలుసుకున్న అలీ కార్మికనగర్‌లోని అపార్ట్‌మెంట్‌ వద్ద కాపుకాశాడు. సిద్ధిఖ్‌ తన ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు గుర్తించిన అలీ అక్కడకు చేరుకుని తలుపు కొట్టాడు. ఎంతకూ అతడు తీయకపోవడంతో ఆ పక్కనే ఉన్న కిటికీ గ్రిల్‌ స్క్రూలు విప్పి దాన్ని తొలగించాడు. ఆ మార్గంలో లోపలకు వెళ్లిన అలీ తన వెంట తెచ్చుకున్న రాడ్డుతో సిద్ధిఖ్‌ తలపై దాడి చేసి హత్య చేశాడు. రక్తపు మరకలను శుభ్రం చేసిన అలీ తెల్లవారుజాము 5 గంటల వరకు అక్కడే ఉన్నాడు. ఈ సమయంలోనే మృతదేహాన్ని తరలించడానికి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో ఫ్రిడ్జ్‌లో పెట్టి వదిలేశాడు.

ఆపై సిద్ధిఖ్‌ ద్విచక్ర వాహనం తాళం తీసుకున్న అలీ రాడ్డు, రక్తం మరకలు శుభ్రం చేసిన వస్త్రాలు తీసుకుని బయలుదేరాడు. వీటిని మార్గమధ్యలో పడేసిన నిందితుడు తన ఇంటికే చేరుకున్నాడు. హత్యానంతరం ఆ విషయాన్ని ఫోన్‌ చేసి రుబీనాకు చెప్పాడు. హతుడి అన్న మహ్మద్‌ అతిక్‌ అహ్మద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, జూబ్లీహిల్స్‌ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో పాటు సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని మెహిదీపట్నం చౌరస్తా వద్ద అలీని అదుపులోకి తీసుకున్నారు. ఇతడి విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా రుబీనాను పట్టుకున్నారు.  

కుటుంబ కక్షలతోనే..
మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వట్టెపల్లి ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రౌడీషీటర్‌ అసద్‌ఖాన్‌ హత్యకు కారణం కుటుంబ కక్షలని పోలీసులు తెలిపారు. గతంలో జరిగిన అంజత్‌ఖాన్‌ హత్య కేసులో అసద్‌ఖాన్‌ ప్రధాన నిందితుడు. అంజత్‌ఖాన్‌ కుమారుడు తన స్నేహితులతో కలిసే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. 2016లో అసద్‌ఖాన్‌ కూతురును అంజత్‌ఖాన్‌ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. కొద్దిరోజుల తర్వాత సంసార జీవితానికి పనికిరాడంటూ అసద్‌ఖాన్‌ కూతురుకి మరో వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఇరువురి కుటుంబాల మధ్య కక్ష పెరిగింది. అసద్‌ఖాన్‌తో పాటు మరికొంత మంది కలిసి 2018లో అంజత్‌ఖాన్‌ను హత్యచేశాడు. ప్రతీకారంగా అంజత్‌ఖాన్‌ కుమారుడు యాసిన్‌ ఇసాక్‌ అనే ఆటో డ్రైవర్‌ను కిరాయికి మాట్లాడుకున్నా డు. బుల్లెట్‌ వాహనంపై వెళ్తున్న అసద్‌ఖాన్‌ను ఢీకొట్టారు. అనంతరం వేట కొడవళ్లతో హత్య చేశారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

నిషాంత్‌ సింగ్‌ కోసం వేట 
చిక్కడపల్లి: చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సూర్యానగర్‌లో చోటు చేసుకున్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు  సద్‌నామ్‌సింగ్‌ హత్య కేసులో అతడి భార్య సమీప బంధువు నిషాంత్‌సింగ్‌ నిందితుడని పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించగా లభించిన ఆధారాలను బట్టి ఇతడికి మరో ఇద్దరు సహకరించినట్లు తేల్చారు. వారిని పట్టుకోవడం కోసం టాస్క్‌ఫోర్స్, చిక్కడపల్లి పోలీసులతో ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ఇవి ఢిల్లీ, పంజాబ్‌లకు వెళ్లి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దాదాపు 20 రోజుల క్రితం పంజాబ్‌ నుంచి వచ్చి సద్‌నామ్‌సింగ్‌తో కలిసి ఉంటున్న నిషాంత్‌ కోసం వేట సాగుతోంది.

ఈ కేసు దర్యాప్తులో సద్‌నామ్‌సింగ్‌కు, అతడి భార్య బల్జీత్‌ కౌర్‌కు మధ్య ఉన్న వివాదాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. హతుడి చేతులు కట్టేసి చంపినట్లు ఆనవాళ్లు ఉండటం, హత్య చేసిన గదిలో లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరి కంటే ఎక్కువ మందే ఈ హత్యలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చంపే ముందు సద్‌నామ్‌కు మత్తుమందు ఇచ్చారా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు.
చదవండి: ఎమ్మెల్యే కారులో రూ.2కోట్లు చోరీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top