జాగ్రత్త: సైబర్‌ నేరగాళ్ల కొత్త రకం మోసం.. ఓటీపీ చెప్పకున్నా..

Man Loses 75000 Without Sharing OTP In Mumbai - Sakshi

ముంబై : కొత్త రకం మోసానికి తెరతీశారు సైబర్‌ నేరగాళ్లు. ఓటీపీ చెప్పకపోయినా ఓ వ్యక్తి ఖాతాలోంచి డబ్బులు దోచేశారు. మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ‘‘ ప్రదీప్‌ ప్రభాకర్‌ అనే 45 ఏళ్ల వ్యక్తి ముంబై, పోవాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నాడు. జూన్‌ 27వ తేదీన ఆన్‌లైన్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ ఆర్డర్‌ చేయాలనుకున్నాడు. గూగుల్‌లో రోమా కేఫ్‌ నెంబర్‌ కనిపించింది. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. అవతలినుంచి ఓ వ్యక్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మళ్లీ చేస్తానని పెట్టేశాడు. 
రెండు నిమిషాల తర్వాత ఆ వ్యక్తినుంచి ఫోన్‌ వచ్చింది. 
హోటల్‌ వ్యక్తి : మీకేం ఐటమ్స్‌ కావాలి సార్‌!.
ప్రదీప్‌ : పనీర్‌ దోస, ప్లేట్‌ వడ..
హోటల్‌ వ్యక్తి : డబ్బులు ఏవిధంగా చెల్లిస్తారు.
ప్రదీప్‌ : క్యాష్‌ ఆన్‌ డెలివరీ చేస్తాను.
హోటల్‌ వ్యక్తి : సారీ సార్‌! కరోనా టైం కాబట్టి ఆన్‌లైన్‌ పేమెంట్‌కు మాత్రమే అవకాశం ఉంది. నేను మీకు లింక్‌ పంపుతాను. దాని ద్వారా మా యాప్‌ను డౌన్‌లౌడ్‌ చేసుకుని పేమెంట్‌ చేయండి.
ప్రదీప్‌: సరే!.
           హోటల్‌ వ్యక్తి ఫోన్‌ పెట్టేయగానే ప్రదీప్‌ లింక్‌ను ఓపెన్‌ చేశాడు. స్ప్రింగ్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ వెంటనే డబ్బులు కట్‌ అయ్యాయని తెలుపుతూ.. లావాదేవీలకు సంబంధించిన అలర్ట్‌లు రాసాగాయి. ఇలా దాదాపు 75 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో అతడు బ్యాంక్‌కు ఫోన్‌ చేసి కార్డును బ్లాక్‌ చేశాడు. ఆ తర్వాత బ్యాంకును, పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్‌ నేరగాళ్లు ఎస్‌ఎమ్‌ఎస్‌ ఫార్వడర్‌ యాప్‌ ద్వారా మోసానికి పాల్పడినట్లు తేల్చారు. ప్రదీప్‌ డౌన్‌లోడ్‌ చేసిన స్ప్రింగ్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ యాప్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లకు మెసేజ్‌లు వెళ్లాయని, వారినుంచి ప్రదీప్‌కు మెసేజ్‌లు వచ్చి, ఓటీపీని మిస్‌యూజ్‌ చేసి లావాదేవీలు పూర్తి చేశారని గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top