కన్నా .. నేనూ నీ వెంటే 

Father Dies of Heart Attack After Son Dies of Road Accident Nalgonda - Sakshi

కుమారుడి దుర్మరణం.. ఆగిన తండ్రిగుండె

వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

అక్కడికక్కడే యువకుడి మృత్యువాత

కొడుకు మృతదేహాన్ని చూసి కుప్పకూలిన తండ్రి.. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యుఒడికి..

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు 

మిర్యాలగూడ మండలం తడకమళ్లలో అలుముకున్న విషాదఛాయలు

ఒక్కడే కుమారుడని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు.. ఓ పని నిమిత్తం వెళ్లిన కుమారుడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఆ తండ్రి కలలో సైతం ఊహించి ఉండడు. గుర్తుతెలియని వాహన రూపంలో వచ్చిన మృత్యువు ఆ యువకుడిని కబళించగా... కుమారుడు ఇక లేడనే చేదు నిజాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఘటనాస్థలిలో కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలాడు. ‘కన్నా.. నీ వెంటే నేనూ’ అనుకున్నాడేమో హఠాన్మరణం చెందాడు. 

సాక్షి, వేములపల్లి : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన గొర్ల ఇంద్రారెడ్డి(52), సుజాత దంపతులకు కుమారుడు భరత్‌రెడ్డి (30), కుమార్తె ఉన్నారు. ఇద్దరికి వివాహాలు కాగా, భరత్‌రెడ్డి తన భార్య స్నేహ, కుమారుడు, కుమార్తెతో కలిసి కొంతకాలంగా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. భరత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై మాడుగులపల్లి మండలం బొమ్మకల్లుకు వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.మార్గమధ్యలో వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారుకు చేరుకోగానే వెనుకనుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భరత్‌రెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. 

గుండెలవిసేలా రోదించి..
రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న తండ్రి గొర్ల ఇంద్రారెడ్డి వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తూనే కుప్పకూలిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిమిషాల వ్యవధిలోనే తండ్రీకుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో ఆవరణలో అందరి ముఖాల్లో విషాదఛాయలు కనిపించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేములపల్లి ఎస్‌ఐ డి. రాజు తెలిపారు. 

పలువురి పరామర్శ
ఇంద్రారెడ్డి సీపీఎం నాయకుడు కావడంతో ఆయన ఇంటి వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దుఃఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి పరామర్శించారు. వారిలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డబ్బీకార్‌ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వేములపల్లి వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధనిశశిధర్‌రెడ్డిలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top