10 లక్షల మందికి.. రూ.1,500 కోట్లకు టోకరా 

Cyberabad Police Busts Marketing Scam - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ‘ఇండస్‌ వివా’ 

బాధితులు లక్ష మందికి పైనే 

చీటింగ్‌ కేసులో ముగ్గురు టీచర్లు 

కంపెనీ సీఈవో సహా 24 మంది అరెస్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య ఉత్పత్తుల ముసుగులో గొలుసు కట్టు మోసానికి తెరలేపి దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసిన బెంగళూరుకు చెందిన ఇండస్‌ వివా సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనూ లక్ష మందికి పైగా సభ్యులుగా చేర్చుకుని వంచించింది. ఈ కేసులో ఆ సంస్థ సీఈవో అభిలాష్‌ థామస్‌ సహా 24 మందిని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం అరెస్ట్‌ చేసింది. ఆరుగురిని బెంగళూరులో, ఒకరిని కేరళలో, 14 మందిని తెలంగాణలో, ముగ్గురిని ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి భార్యలు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఉపాధ్యాయులు తమ విధులకు సెలవు తీసుకొని మరీ ఈ మోసాలకు పాల్పడ్డట్లు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం మీడియాకు వెల్లడించారు.  

భారీ ఆఫర్లు.. భలే ర్యాంకులు 
ఆమ్వే, మోనావీ కంపెనీల్లో పనిచేసిన అభిలాష్‌ థామస్‌ సీఈవోగా ఉంటూ 2014లో బెంగళూరు కేంద్రంగా ఇండస్‌ వివా హెల్త్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించాడు. ఇతడు ప్రేమ్‌కుమార్, ఎం.సుబ్రహ్మణ్యం, కురువిలా చాకో, ఇమదాదుల్లా షరీఫ్‌తో కలసి రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అతి తక్కువ కాలంలో ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ప్రెసిడెంట్‌ క్లబ్‌ మెంబర్‌ (పీసీఎం) ప్లాన్‌ కింద రూ.1,50,000 కట్టి చేరితే 50 ఆరోగ్య ఉత్పత్తులతో పాటు రూ.25 వేలు విలువ చేసే సామగ్రి ఇస్తామని ఆశ చూపారు. అలాగే ఈ ప్లాన్‌లో చేరిన వ్యక్తికి కంపెనీ సీఈవోతో విందు అవకాశం కల్పిస్తామన్నారు. కేవలం 9 వారాల్లో 256 మందిని చేర్పిస్తే రూ.2,56,000 ప్రోత్సాహకాలు ఇస్తామని ఆశ చూపారు.

ఎక్కువ మందిని చేర్పించిన వారికి స్టార్‌ డిస్ట్రిబ్యూటర్, రూబీ, పెరల్, ఎమరాల్డ్, సఫైర్, ఎగ్జిక్యూటివ్‌లు, ఎగ్జిక్యూటివ్‌ డైమండ్, ఎగ్జిక్యూటివ్‌ బ్లూ డైమండ్, బ్లాక్‌ డైమండ్‌ అంబాసిడర్‌ ర్యాంకులు ప్రకటించి వివిధ రకాల రివార్డులతో పాటు విదేశీ యానం కల్పిస్తామని భారీ ఆఫర్లను ప్రకటించి లక్షలాది మందిని ఈ స్కీముల్లో చేర్పించింది. ముఖ్యంగా బ్లాక్‌ డైమండ్‌ ర్యాంకు వచ్చిన వారికి బెంజ్‌ కారుతో పాటు అమెరికా పర్యటన, వారి ఫ్యామిలీపై ప్రత్యేక డాక్యుమెంటరీ తీస్తామంటూ ఆశ చూపారు. ఇలా విదేశాల్లోనూ వీరి బ్రాంచ్‌లు ఉండటంతో కొంతమందిని విదేశాలకూ పంపినట్లు పోలీసు విచారణలో తేలింది. 

భార్యభర్తలిద్దరూ చేరాల్సిందే.. 
ఈ స్కీముల్లో భర్త చేరితే భార్య, భార్య చేరితే భర్త, ఆ తర్వాత వారి బంధువులు, స్నేహితులను చేర్పించేలా చేశారు. ఇలాగే అనేక మందిని చేర్పించిన యాదగిరిగుట్ట గోశాలకు చెందిన ఉపాధ్యాయుడు ములుగు వెంకటేశ్, అతడి భార్య నాగదేవి, మిర్యాలగూడ సీతారాంపురానికి చెందిన ఉపాధ్యాయుడు మన్నెపు హరిప్రసాద్, అతడి భార్య రేణుక, హయత్‌నగర్‌ మునగనూరుకు చెందిన ఉపాధ్యాయుడు కేసీఎస్‌ శర్మ మూడేళ్లుగా ఒక్కొక్కరూ నెలకు రూ.10 లక్షలకుపైగానే ఆర్జిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. గతంలో ప్రోహెల్దీ కంపెనీ ఎంఎల్‌ఎం మోసం కేసులో అరెస్టైన నిందితుడు కొండా శ్రీనివాసులు ఇండస్‌ వివా సంస్థలో చేరి చీటింగ్‌ చేస్తూ దొరికినట్లు సీపీ సజ్జనార్‌ చెప్పారు. 

పిల్లలు పుడతారంటూ..!
బెంగళూరు నీలముంగళ కేంద్రంగానే అలివ్‌ లైఫ్‌ సైన్సెస్‌ తయారీ కేంద్రం పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఆరోగ్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. సంతానం లేని వారికి పిల్లలు పుట్టేందుకు ఐ–పల్స్‌ అని, లావు ఉన్నవాళ్లు సన్నబడేందుకు ఐ–స్లిమ్‌ అని, కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు ఐ–కాఫీ, చర్మం తెల్లబడేందుకు ఐ–గ్లో అని తదితర ఉత్పత్తులను సభ్యులకు అంటగడుతున్నారు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఈ ఉత్పత్తులను రూ.3,597 ధరకు అమ్ముతున్నారు. ఆ మొత్తంలో 10 శాతం ధరతోనే ఇవి తయారైతే.. అందరి కమిషన్లు కలుపుకొని భారీ మొత్తానికి స్కీమ్‌లో చేరేవారికి ఇస్తున్నారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. సులభ పద్ధతిలో డబ్బు వస్తుందంటే నమ్మొద్దని సూచించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top