రూ.30వేలు ఇప్పిస్తామంటూ బాలిక శీలానికి వెల..

Chittoor: 15 Year Old Girl Was Abducted By Young Man - Sakshi

కిడ్నాప్‌ చేసి ఎక్కడెక్కడో చక్కర్లు కొట్టిన జులాయి

ఫిర్యాదు చేయడంలో వదలి వెళ్లిన వైనం

నిందితుడి తరఫున ఒక నేత రాజీ‘బేరం’

ఫిర్యాదు చేశారని బాధితుల ఇళ్లపై రాళ్లతో నేత సోదరుడి దాడి 

ఇద్దరు మహిళలకు గాయాలు

సాక్షి, మదనపల్లె‌: ఓ 15 ఏళ్ల బాలికను ఓ యువకుడు మాయమాటలతో తీసుకెళ్లాడు. బాలిక కనబడటం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ బాలికను ఎక్కడెక్కడో తీసుకెళ్లిన ఆ యువకుడు తిరిగి తీసుకు వచ్చి  వదలి వెళ్లాడు. దీంతో బాలిక జీవితాన్ని అన్యాయం చేశాడని బంధువులు మళ్లీ పోలీస్‌ స్టేషన్‌ గడప ఎక్కడంతో ఓ పార్టీ నేత (వైఎస్సార్‌ సీపీ కాదు) రంగప్రవేశం చేశారు. రూ.30వేలు ఇప్పిస్తామంటూ బాలిక శీలానికి వెలకట్టారు. రాజీ‘బేరం’చేశారు. అయితే తమవారినే పోలీస్‌ స్టేషన్‌కు రప్పిస్తావా? అంటూ ఆ నేత సోదరుడు ఫిర్యాదుదారులపై రెచ్చిపోయాడు. కొందరిని వెంటేసుకుని బాధితులపై బుధవారం రాత్రి రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు.

బాధితుల కథనం మేరకు..శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన హరీష్‌ (30)అనే యువకుడు మాయమాటలతో తీసుకెళ్లిపోయాడు. దీంతో 20వ తేదీన ఆ బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్‌ ఆ బాలికను కొన్నిరోజుల పాటు ఎక్కడెక్కడో తిప్పి మదనపల్లె బస్టాండు వద్ద వదలి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాల గురించి చెప్పడంతో అనంతరం ఆ బాలిక బంధువులు, సోదరి టూటౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి జీవితాన్ని నాశనం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. బాలికను పోలీసులు తహశీల్దార్‌ ఎదుట బుధవారం హాజరుపరిచారు.  (ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య)

ఇది తెలుసుకున్న హరీష్‌ మిత్రుడు, అప్పటికే రాజీ‘బేరం’ కుదిర్చిన నేత సోదరుడు మరికొందరితో కలిసి బుధవారం రాత్రి బాధితుల ఇంటిపై రాళ్లతో దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో పెద్ద రెడ్డెమ్మ(30), చిన్న రెడ్డెమ్మ(21) గాయపడ్డారు. దీంతో వారు గురువారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను కిడ్నాప్‌ చేసి ఐదు రోజుల పాటు సోమలలో ఉన్నారని, దీనిపై స్థానిక నాయకుడొకరు పంచాయితీ చేసి , రాజీకి రాకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించడంతో స్టేషన్‌ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని వాపోయారు. వీరి గుట్టును బయట పెట్టినందుకు తమపై దాడి చేశారని, వీరి నుంచి ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top