మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన

కాలనీవాసుల దాడిలో వ్యక్తి మృతి
జవహర్‌నగర్ (హైదరాబాద్): ఇంట్లో ఉన్న మహిళ పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కాలనీవాసులు చితకబాదడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌లోని భగత్‌సింగ్‌నగర్ కాలనీలో నివసించే రాజు (39) కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు.
కొంతకాలంగా మద్యం సేవించి నిత్యం కాలనీలోని మహిళలతో దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. కాలనీవాసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అతిగా మద్యం సేవించిన రాజు స్థానికంగా ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన కాలనీవాసులు ఆవేశంతో రాజును చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ క్లూస్ టీమ్‌ను రప్పించి దర్యాప్తు ప్రారంభించారు.