గుడ్లనాయనపల్లిలో రైతు వినూత్న వ్యవసాయం
12 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సేంద్రియ సేద్యం
వివిధ పంటలతో ముందుకు సాగుతున్న రైతు ఇక్బాల్
కుప్పం రూరల్ : కోయంబత్తూరుకు చెందిన ఇక్బా ల్ అలియాస్ డాక్టర్ బాబు 15 ఏళ్ల క్రితం కుప్పం మండలం గుడ్లనాయనపల్లికి వచ్చి స్థిరపడ్డాడు. ఆయన చైన్నెలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించాడు. ఎమ్మెస్సీ ఇండస్ట్రియల్ డిజైనింగ్, సేఫ్టీ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశాడు. తర్వాత పదేళ్లు ఆస్త్రేలియాలో ఉద్యోగం చేశాడు. అక్కడ ఉన్నప్పుడే అయన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త బిల్ మెలిసన్, జపాన్ శాస్త్రవేత్త మోసానో టుకుకో వ్యవసాయ విధానాలకు ఆకర్షితులయ్యాడు. తాను కూడా సమ గ్ర ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకు న్నాడు. 2010లో కుప్పం మండలం గుడ్లనాయనపల్లి వద్ద 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. గుట్టలతో కలిసి ఉన్న ఆ భూమిని సుమారు రూ.80 లక్షలు వెచ్చించి వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు.
మొక్కల పెంపకంపైనా దృష్టి
బాబు తన వ్యవసాయ క్షేత్రంలో 40 రకాల మొక్కలను పెంచుతున్నాడు. ముఖ్యంగా ఎర్ర చందనం, శ్రీగంధం, రోజ్‌వుడ్, టేకు, ఔషధ మొక్కలైన కదంబం, మరిడి,, ఉడిలీ, పండ్ల రకాలైన వాటర్ ఆపిల్, బొప్పాయి, జామ, మామిడి, పనస, అల్ల నేరేడు తదితరాలను పెంచుతున్నాడు. పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వరి, రాగి. జొన్న, సజ్జ, మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు.
ప్రత్యేక ఆకర్షణగా అమెరికా మేకలు
వ్యవసాయ క్షేత్రంలో అడుగు ఎత్తు కూడా లేని మేక ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాబు స్నేహితుడు స్టీఫెన్ అనే వ్యక్తి అమెరికా నుంచి వాటిని పంపించినట్టు బాబు తెలిపాడు. అవి చిన్నగా కనిపించినా పిల్లలను ఈనుతాయని చెబుతున్నాడు.
కోళ్లు, గొర్రెలు, పావురాల పెంపకం
బాబు తన వ్యవసాయ క్షేత్రంలో కోళ్లు, గొర్రెలు, పావురాల పెంపకాన్ని చేపట్టారు. కోళ్లను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పెంచడం ద్వారా అవి మూడు నెలల్లోనే బాగా బరువు పెరుగుతున్నాయి. రసాయనాలతో కూడిన దాణా కాకుండా గింజలతో కూడిన దాణా వేస్తున్నాడు. దీంతో ఒక్కో కోడి రూ. 650 నుంచి రూ.700 వరకు ధర పలుకుతోంది. అలాగే పావురాలను కూడా పెంచుతున్నాడు. జత పావురాలు రూ.2 వేలకు పైగా అమ్ముడవుతున్నాయి. 50 గొర్రెలను సైతం పెంచుతున్నాడు. ఒక్కో గొర్రెను రూ.6 వేలకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో పెరిగిన చేపలను ఉచితంగా స్థానికులకు పంచిపెడుతున్నాడు.
ఆయన ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశాల్లో ఉద్యోగాలు చేశాడు. రూ.లక్షల ఆదాయం వస్తున్నా సంతృప్తి కలుగలేదు. ఏదైనా వినూత్నంగా చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదిలేశాడు. ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా 12 ఎకరాల్లో పంటల సాగు చేపట్టారు. వివిధ పద్ధతులను అనుసరిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాడు. పలువురు రైతులకు ఆదర్శంగా మారాడు. మట్టిని నమ్ముకుంటే నష్టపోయే అవకాశం ఉండదని నిరూపిస్తున్నాడు.
రైతులకు సలహాలు.. సూచనలు..
బాబు తన క్షేత్రంలో మండలంలోని రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు చేస్తున్నాడు. విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నాడు. పంటల సాగులో మెళకువలను తెలియజేస్తూ వారు కూడా వ్యవసాయంలో రాణించేలా కృషి చేస్తున్నాడు.


