నిండ్ర (నగరి) : త్వరలో ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఆయిల్‌పామ్ సంస్థ జనరల్ మేనేజర్ విజయప్రసాద్ తెలిపారు. శుక్రవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆయిల్ పామ్ తోటల క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణవనం, నాగలాపురం, నిండ్ర, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు, పుత్తూరు, పిచ్చాటూరు, రామచంద్రపురం, ఏర్పేడు, తొట్టెంబేడు, బీఎన్ కండ్రిగ మండలాలకు చెందిన ఆయిల్ పామ్ సాగుకు సుముఖంగా ఉన్న రైతులకు ఆయన అవగాహన కల్పించారు. సాగులో మెలకువలు, ప్రభుత్వ సబ్సిడీలు, సంస్థ అందించే ప్రోత్సాహాలను తెలియజేశారు. ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాలుగు గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం గెలల ధర టన్ను రూ.24 వేలు పలుకుతోందన్నారు.
62కు పెంపుపై చర్చ
చిత్తూరు కార్పొరేషన్: ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60–62కు పెంచుతూ కేబినెట్ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఉద్యోగ విరమణ వయస్సు పెరగనుంది. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ సంస్థలో ఉద్యోగుల వీటి పై చర్చకు తేరలేపారు. వయో పెంపునకు వారికి వర్తిస్తే ఏ సంవత్సరం నుంచి అది అమల్లోకి వస్తుందని ఆరా తీస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏఈ, డీఈ, ఈఈ, ఎస్‌ఈ, ఆపై స్థాయి అధికారులు ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం రెండేళ్ల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వయో పెంపు సంవత్సరాన్ని బట్టి అర్హత ఉన్నవారు తిరిగి వారి స్థానాల్లోకి వస్తే ప్రస్తుతం ఆ స్థానాల్లో ఉన్నవారు పాత స్థానానికి వెళ్లాలా..? ప్రమోషన్ వచ్చిన ఉద్యోగి తిరిగి పాత స్థానానికి పనిచేయడానికి అంగీకరిస్తారా?.. దీంతో పాటు రెండేళ్లు సంబంధిత శాఖల్లో ఉద్యోగాల భర్తీ ఉండదా..? అని చర్చకు తెరలేసింది. భారీ మొత్తంలో జీతాలు తీసుకొని పదవీ విరమణ చేసిన వారు తిరిగి సంస్థలో వస్తే ఆర్థిక భారం పడదా..? వారికిచ్చే జీతాలతో కొత్తగా ఆరుగురు వరకు ఉద్యోగులను నియమించుకోవచ్చు. వీరికి రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ రూ.కోట్లల్లో ఇచ్చారు.. తిరిగి వాటిని ప్రభుత్వానికి ఇవ్వాలా..? అనే సందేహాలు ఉద్యోగులు వెల్లబుచ్చుతున్నారు.


