హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
– ఘనంగా హోంగార్డు ఆవిర్భావ దినం
చిత్తూరు అర్బన్ : హోంగార్డుల పనితీరు తీరును.. మరెవ్వరితోనూ పోల్చడం సాధ్యంకాదని ఎస్పీ తుషార్ డూడీ స్పష్టం చేశారు. 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించారు. పోలీసులకు ఏ మాత్రం తీసిపోకుండా నిర్వహించిన కవాతును ఎస్పీ అభినందించారు. దాదాపు 62 ఏళ్లకు పైగా హోంగార్డులు పోలీసులతో కలిసి సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం ఇటీవల హోంగార్డులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. అలాగే హోంగార్డులు చిత్తూరు నగర వీధుల్లో ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న హోంగార్డు పిల్లల్లో ప్రతిభ ఉన్నవారికి ఉపకార వేతనాలను అందజేశారు. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ చూపించిన 13 మందికి ఉత్క్రిష్ట, అతి ఉత్క్రిష్ట పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్.రాజశేఖర్ రాజు, డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, మహబూబ్ భాష, సీఐలు నిత్యబాబు, శ్రీధర్ నాయుడు, మనోహర్, ఉమామహేశ్వరరావు, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ
హోంగార్డు కుమారుడికి ఉపకార వేతనం అందజేస్తున్న ఎస్పీ
హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి


