విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు

Dec 2 2025 8:16 AM | Updated on Dec 2 2025 8:16 AM

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు

● ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ● పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీ గురుమూర్తి

తిరుపతి మంగళం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీ పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తితోపాటుగా రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, పాడైన ఆర్వో ప్లాంట్లు, శుభ్రం చేయని నీటి ట్యాంకులు, వంటగది పరిశుభ్రత లోపం వంటి కారణాలతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం తదితర వివరాలు తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి ఎంపీ గురుమూర్తికి వివరించారు. అయితే, వారందరికీ వైద్య చికిత్స అందించి డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి, లోపాలున్న చోట వెంటనే సరిదిద్దినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి చెప్పిన వాటికి భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు జరగక ముందే చర్యలు తీసుకొంటే సమస్య ఉండేది కాదన్నారు. ఇప్పటికీ చాలా వసతి గృహాల్లో కనీస వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తప్పులు సరిదిద్దక పోగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా నివేదికలు పంపుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రధాన మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం వివరాలతోపాటు పాఠశాలల్లో భోజన నాణ్యత, భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి మంత్రి వివరిస్తూ, ఈ పథకాన్ని అమలు చేయడం, ప్రతిరోజూ విద్యార్థులకు పోషకాహారంతో కూడిన వేడి భోజనం అందించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement