క్రీడాభివృద్ధికి ఎనలేని సేవలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో క్రీడాభివృద్ధికి బాలాజీ ఎనలేని సేవలందించారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ విరమణ పొందిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీకి సోమవారం కలెక్టరేట్‌లో సత్కార కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత బాలాజీకి దక్కతుందన్నారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేశారన్నారు. ఆయనకు అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నారు. ఏ సమస్యనైనా పరిష్కరించగల నేర్పరితనం ఆయన సొంతమని కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఆయన సేవలు క్రీడాశాఖకు ఎంతో ముఖ్యమన్నారు. రిటైర్డ్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ మాట్లాడుతూ తన విధి నిర్వహణ ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. అనంతరం బాలాజీ దంపతులను ఉన్నతాధికారులు దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌ఓ మోహన్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, జిల్లా నైపుణ్యాధికారి గుణశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


