ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు చిత్తూరు జిల్లా లైజనింగ్ ఆఫీసర్ హరిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ రవి కథనం మేరకు.. 2018 జనవరి 25వ తేదీ రొంపిచర్ల పోలీసులు పీలేరు తిరుపతి రోడ్డు, రొంపిచర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లి సమీపంలోని దండపాణి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఓ కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. కారులోని ఐదుగురు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. సదుం మండలం, బూరగమంద గ్రామానికి చెందిన పగడాల వెంకటరమణ, సదుం మండలం సీతన్న గారిపల్లికి చెందిన మల్లెల హరినాథ్ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర్ నారాయణ వాదించారు.


