
భార్యపై కత్తితో దాడి
కుప్పంరూరల్ : భార్యను దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన కుప్పం మండలం, బైరప్పకొటాలు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుప్పం మండలం, బైరప్పకొటాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి సమీపంలోని కెడయంబేడు గ్రామానికి చెందిన రాజేష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల కొడుకు ఉన్నాడు. కీర్తన ప్రసవం కోసం స్వగ్రామం బైరప్పకొటాలు గ్రామానికి వచ్చింది. ఆరు నెలలుగా ఇక్కడే ఉంటోంది. రాజేష్ మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళ్లేవాడు. దంపతుల మధ్య నెల రోజులుగా విబేధాలు చోటు చేసుకున్నాయి. నిత్యం గొడవలు పడేవారు. ఇదే క్రమంలో బుధవారం గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో రాజేష్ కత్తి తీసుకుని కీర్తనపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కీర్తనకు నోట్లో గుడ్డ కుక్కడంతో చాలాసేపటి వరకు బయటికి తెలియరాలేదు. ఎట్టకేలకు కీర్తన కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు వచ్చి రాజేష్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. రాజేష్ తప్పించుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి పైకప్పు పైకి వెళ్లాడు. గ్రామస్తులు రాజేష్‌ను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కీర్తనను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో కీర్తనను పీఈఎస్ కళాశాలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా కీర్తన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. రాజేష్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.