
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా జేఏసీ నేతలు మురళీకృష్ణ, యజ్ఞేశ్వరరావు, వివేకానందరెడ్డి, చంద్రమౌళి తెలిపారు. బుధవారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణను ప్రకటించామన్నారు. ప్రధాన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయినందున ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగదు రహిత వైద్యం అందించాలని, 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. జేఎల్‌ఎం గ్రేడ్–2లను, జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు ప్రయోజనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను మంజూరు చేయాలన్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన సబ్ ఇంజినీర్లకు, ఏఈలుగా పదోన్నతిలో అవకాశం కల్పించాలన్నారు. అర్హులైన ఓఅండ్‌ఎం ఉద్యోగులను జూనియర్ సహాయకులు, సబ్ ఇంజినీర్‌గా ఖాళీలలో నియమించాలన్నారు. గురువారం సైతం నిరసన వ్యక్తం చేసి, 19, 20న రిలే దీక్షలు, 22న ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు విన్నపం సమర్పించనున్నామని వివరించారు.