
టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ
పలమనేరు: పట్టణంలోని టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ బాలాజీ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకున్న విషయం శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని పెంకుల కిట్టన్న మిషన్ సమీపంలో నివాసముంటున్న ఆర్వీ బాలాజీ కుటుంబం వారం రోజుల క్రితం బయటికెళ్లింది. దీన్ని గమనించిన దొంగలు పక్కా ప్రణాళికతో ఇంటిపైనున్న కిటికీని తొలగించి లోనికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను ముందుగా తొలగించారు. ఆపై బీరువాలను ధ్వంసం చేసి సుమారు కిలో బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును చోరీ చేసి తీసుకెళ్లారు. కాగా గురువారం రాత్రి ఇంటికొచ్చిన ఆర్వీ బాలాజీ కుటుంబీకులు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిద్రించారు. శుక్రవారం ఉదయం పై అంతస్తులోని ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పని మనిషి బీరువాలు తెరిచి ఉండడం, కిటికీ ఊచలు విరిగిపోయి ఉండడాన్ని గుర్తించి యజమానికి తెలిపింది. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్టు బాధితుడు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. డీఎస్పీ డేరంగుల ప్రభాకర్, సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనలో ఎంత బంగారు చోరీ అయిందనే విషయం ఇంకా నిర్ధారించలేదు. ఆర్థిక స్థితిగతులు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.

టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ

టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ