
అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి
– స్నేహితుడే హతమార్చాడని బంధువుల ఆరోపణ
కుప్పం: ఏడు నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మండల పరిధిలోని గెరిగశీనేపల్లి పంచాయతీ, డీ.ఆర్ అగ్రహారం గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీష్ గర్భిణిపై లైంగిక దాడి చేసి హతమార్చాడని మృతురాలు బంధువులు శుక్రవారం కుప్పం పోలీసు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మృతురాలి బంధువుల కథనం.. గెరిగశీనేపల్లి గ్రామానికి చెందిన ఇంద్రజ(30)కు వరుసకు మేనమామ అయిన పెరుమాల్‌తో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. పెరుమాల్ కూలి పనుల కోసం అరేబియన్ దేశం కత్తర్‌కు వెళ్లేవాడు. రెండేళ్లకోసారి స్వగ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సతీష్ ఇంద్రజతో స్నేహంగా ఉండేవాడు. ఏమైందో ఏమోగానీ గురువారం ఉదయం ఇంద్రజ డీఆర్ అగ్రహారం గ్రామంలోని సొంత ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈమె మృతిపై కత్తర్‌లో ఉన్న భర్త పెరుమాల్‌కు సమాచారం అందింది. అతను వచ్చి భార్య మృతిని తట్టుకోలేక బోరున విలపించాడు. సతీష్ అనే వ్యక్తి తన భార్యను వేధించి లైంగికదాడి చేసి చంపేశాడని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు సతీష్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నల్లమందు ఉండలు తిని కుక్క మృతి
గుడిపాల: నల్ల మందు ఉండలు తిని ఓ కుక్క మృతి చెందింది. వివరాలు.. మండలంలోని పశుమంద ఎస్టీ కాలనీ సమీపంలో గల చెరువు వద్ద అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం నల్లమందు బాంబులను పెట్టారు. ఇంతలో అక్కడికి వెళ్లిన ఓ కుక్క దాన్ని పట్టుకొని కొరకడంతో ఒక్కసారిగా పేలింది. ఆపై తల పగిలి అక్కడికక్కడే మృతిచెందింది.

అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి