
కుళ్లబొడుస్తున్న టీడీపీ నేతలు
● నాలుగు నెలలుగా నిర్విరామంగా అక్రమ తవ్వకాలు ● రోజూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు ● రైతుల ముసుగులో ఇటుక బట్టీలు, వెంచర్లకు విక్రయాలు ● మొరవ వరకే మట్టి ఎత్తాలనే నిబంధన ఉన్నా పట్టించుకోని నేతలు ● అక్రమ తవ్వకాలపై మాట్లాడినందుకు ఇరిగేషన్ అధికారిని డమ్మీని చేసిన వైనం
చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువు బావురుమంటోంది. నాలుగు నెలలుగా టీడీపీ నేతలు చెరువుని కుళ్లబొడుస్తున్నారు. అందులోని మట్టిని రాత్రిపగలు తేడాలేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మొరవ వరకే మట్టి ఎత్తాలనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా చెలరేగిపోతున్నారు. యథేచ్ఛగా జేసీబీలతో తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మట్టి తవ్వకాలపై ఓ ఇరిగేషన్ అధికారి ప్రశ్నించినందుకు అతన్ని డమ్మీ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ మట్టి దందాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..
చిత్తూరు టాస్క్‌ఫోర్స్: చిత్తూరులో నిత్యం లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్టాండ్ ఆనుకుని కట్టమంచి చెరువు ఉంది. ఈ చెరువులో నాలుగు నెలల నుంచి రాత్రి పగలు తేడాలేకుండా మట్టిదోపిడీ సాగుతోంది. కళ్లెదుటే కనిపిస్తున్నా ఉన్నతాధికారులెవ్వరూ నోరుమెదలేకపోతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న ఈ మట్టిమాఫియాపై స్థానికులు గ్రీన్‌ట్రిబ్యునల్‌కి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ భూములకు మట్టి అవసరమైతే రైతు రూపాయి చెల్లించి తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. ఆ రైతు కూడా పాసుపుస్తకాలతో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆపైనే మట్టి తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. మట్టి తీసుకోవాలన్నా మొరవ వరకే తవ్వుకోవాల్సి ఉంటుంది. మొరవకు మించి చెరువులో మట్టిని తవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు.
అమ్మకాలు ఇలా..
కట్టమంచి చెరువులోని మట్టిని జేసీబీలతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు పరిధిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటుక బట్టీల వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో వైపు నగరంలోని కూటమి నేతలు కూడా వారికి తెలిసిన వారికి మట్టిని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. టిప్పర్ మట్టి రూ.4వేల నుంచి రూ.5వేలు, ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 23న ప్రారంభమైన తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఎవరైనా మాట్లాడితే టీడీపీ నేత ఎదురుతిరిగి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఇరిగేషన్‌లోని ఓ అధికారి మట్టి తవ్వకాలపై వేరొకరితో చర్చించినందుకు అతని అధికారాలకు కోత పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలపై అధికారులెవ్వరూ నోరెత్తకుండా టీడీపీ నేత చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కట్టమంచి చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

కుళ్లబొడుస్తున్న టీడీపీ నేతలు

కుళ్లబొడుస్తున్న టీడీపీ నేతలు

కుళ్లబొడుస్తున్న టీడీపీ నేతలు

కుళ్లబొడుస్తున్న టీడీపీ నేతలు