
గజ బాధితులకు పరిహారం
యాదమరి: యాదమరి మండలంలో గజ బాధిత రైతులకు మొదటి విడతగా రూ.1.45 లక్షలు పంపిణీ చేశారు. ఈనెల 5న ‘పరిహారానికి గ్రహణం’ శీర్షికన సాక్షిలో వార్త వెలువడింది. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం గురవారం స్థానిక ఎమ్మెల్యే కె.మురళీమోహన్ చేతుల మీదుగా యాదమరి, బంగారుపాళ్యం మండలాల్లోని దాదాపు 20 మంది రైతులకు పరిహారాన్ని అందజేశారు. రెండో విడత పరిహారాన్ని మరో వారం రోజుల్లో అందజేస్తామని అటవీశాఖాధికారులు తెలిపారు.
టీకాలు వేయించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వ్యాధి నిరోధక టీకాలను పిల్లలకు వంద శాతం వేయించాలని డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆశా నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గర్భిణుల నమోదు విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. వారికి వైద్య సేవలందించే విషయంలో అలసత్వం వద్దన్నారు. శిశుమరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు అనిల్‌కుమార్, జయరాముడు, శ్రీవాణి, మూర్తి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
డీపీఈ ఈఈగా హరి
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో డీపీఈ(విద్యుత్ చౌర్య నివారణ) విభాగం ఈఈగా హరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈఈగా ఉన్న షణ్ముగం ఇటీవల పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో ఆడోని డివిజన్ ఈఈగా ఉన్న హరి ఇక్కడికి బదిలీ పై వచ్చారు. ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు డీఈ, ఏఈలు పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. గతంలో డీపీఈ డీఈ, రూరల్స్ డివిజన్ ఈఈగా పనిచేసిన విషయం గుర్తుచేసుకున్నారు.
అడవుల్లో
సోలార్ లైట్ రిఫ్లెక్టర్స్
చిత్తూరు కార్పొరేషన్: అడవుల్లో సోలార్ లైట్ రిఫ్లెక్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ ఎఫ్‌ఆర్వో థామస్ తెలిపారు. రూ.12,500 విలువచేసే 10 లైట్స్‌ను రాష్ట్ర అటవీశాఖ పంపీణీ చేసిందన్నారు. వీటిని పొలాల సమీపంలో, ఏనుగులు, అడవి జంతువులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కల్లూరు, దేవళంపేట, కోటపల్లె, జూపల్లె, సైజలగుంట, కమ్మపల్లె ప్రాంతాల్లో పెట్టనున్నట్టు వెల్లడించారు. స్తంభాలు ఏర్పాటు చేసి అందులో లైట్స్‌ను పెడతామన్నారు. అందులో నుంచి తేనెటీగల శబ్దంతో పాటు తెల్లటి రంగులో వెలుతురు వస్తుందన్నారు. వెలుతురు జంతువుల కళ్లలో పడడంతో అటువైపుగా అవి రావన్నారు. లైట్స్ ఆఫ్ అండ్ డౌన్, రోటేషన్ పద్ధతిలో వాడుకోవచ్చని వివరించారు.
స్టోర్స్‌కి అగ్నిమాపక పరికరాలు
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో స్టోర్స్‌కు శుక్రవారం అగ్నిమాపక పరికరాలు వచ్చాయి. మొత్తం 14 పరికరాలు ఇక్కడికి చేరుకున్నట్టు ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ఏదైన అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మంటలార్పడానికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మంటలను అదుపు చేయడానికి వీటిని వినియోగించనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు 24 వచ్చినట్టు పేర్కొన్నారు. వాటితో పాటు 56 కిలోమీటర్ల కేబుల్స్ కూడా వచ్చాయన్నారు.

గజ బాధితులకు పరిహారం

గజ బాధితులకు పరిహారం

గజ బాధితులకు పరిహారం