
సర్వే తీరు పరిశీలన
యాదమరి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. శుక్రవారం ఆమె సమగ్ర సర్వే ప్రక్రియలో భాగంగా మండల పరిధిలోని కీనాటంపల్లి పంచాయతీ షికారీ కాలనీలో పర్యటించారు.
సిబ్బంది చేపడుతున్న సర్వే తీరును పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో గృహ యజమానులతో మాట్లాడారు. ఒకే ఇంట్లోనే ఉంటూ వేర్వేరుగా వంట చేసుకునే వారికి సపరేట్‌గానే సర్వే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బోరు మోటారు ఏర్పాటు చేయండి మేడమ్
షికారీ కాలనీ ప్రజలు తమ కష్టాన్ని జేసీకి విన్నవించారు. వ్యవసాయం చేసుకోవాలన్నా అందుకు అవసరమైన నీటి వనరులు లేకపోవడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూములు నిరుపయోగంగా ఉన్నాయని ఆవేదన చెందారు. తమకు ప్రభుత్వం నుంచి వ్యవసాయ బోరును ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా పైళ్లెన వారు ఉన్నారని వారికోసం కొత్త రేషన్ కార్డులు, ఇళ్లను మంజూరు చేయించాలని విన్నవించారు. అసంపూర్తిగా ఉన్న పాత ఇళ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించాలని ఆమెను కోరారు. స్థానిక తహసీల్దార్ పార్థసారథి, ఎంపీడీఓ వేణు పాల్గొన్నారు.