
కాళ్లరిగేలా తిరుగుతున్నా..కనికరించరా?
● కల్లుగీత లైసెన్సు కోసం కలెక్టర్‌కు వినతి ● కలెక్టర్ చెప్పినా లైసెన్సు ఇవ్వకుండా తిప్పలు ● ఆర్నెళ్లుగా అబ్కారీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
చిత్తూరు అర్బన్: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిపేరు లింగేశన్. చిత్తూరు మండలం, తాళంబేడుకు చెందిన కల్లుగీత కార్మికుడు. ఉదయాన్నే చెట్టు ఎక్కి కల్లుగీస్తే తప్ప పూట గడవదు. కులవృత్తిని నమ్ముకున్న లింగేశన్ వద్ద ఉన్న కల్లుగీత లైసెన్సు గడువు తీరిపోయింది. ఆర్నెళ్ల క్రితం కలెక్టర్ వద్దకు వెళ్లి, తన లైసెన్సు రెన్యూవల్ చేయాలని, వీలుకాని పక్షంలో కొత్త లైసెన్సు మంజూరు చేయాలని వేడుకున్నాడు. కలెక్టర్ కూడా పెద్ద మనసుతో వెంటనే కల్లుగీత లైసెన్సు మంజూరు చేయాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి వారంలో రెండు మార్లు చిత్తూరులోని ఎకై ్సజ్ ఈఎస్ కార్యాలయం వద్దకు రావడం, తన లైసెన్సు గురించి అధికారులను అడగం. ‘సారు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. మళ్లీ రావయ్య..!’ అని ఒకరు, సారు మీటింగులో ఉన్నారు, రేపు రా..’ అంటూ మరొకరు. తీరా ఆ సారును కలిస్తే ఫైలు ఎక్కడుందో చూసి చెబుతానంటూ సమాధానం. ఇలా ఆరు నెలలుగా లింగేశన్‌కు ఎకై ్సజ్ అధికారులు నరకం చూపిస్తున్నారు. మళ్లీ కలెక్టర్ వద్దకు వెళితే తనపై పగబట్టి, లైసెన్సు ఇవ్వకుండా చేస్తారేమోనని.. లింగేశన్ ఆర్నెళ్లుగా ఎకై ్సజ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. అసలు కలెక్టర్ సంతకం చేసి ఇచ్చిన అర్జీ అధికారుల వద్ద ఉందో, లేదో కూడా తెలియడం లేదు. లేదనే విషయం చెబితే పరువుపోతుందనుకున్నారో ఏమోగానీ.. వారంలో రెండు సార్లు లింగేశన్‌ను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. పోనీ అధికారులకు ‘దక్షిణ’ ఏదైనా ఇద్దామంటే.. తన పరిస్థితి అంతంత మాత్రమేనంటూ లింగేశన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎకై ్సజ్ అధికారుల రాతి గుండె కరగడానికి పాపం ఈ వ్యక్తి ఇంకెన్నాళ్లు కార్యాలయం చుట్టూ తిరగాలో చూడాలి మరి.