డిగ్రీ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌

Jul 19 2025 3:34 AM | Updated on Jul 19 2025 3:34 AM

డిగ్రీ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌

డిగ్రీ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌

– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. డిగ్రీ అడ్మిషన్లు చేపట్టడంతో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది తీవ్ర ఆలస్యం చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసినప్పటికీ మిన్నకుండాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమందేమో ఇంజినీరింగ్‌ వైపు వెళ్లిపోగా...డిగ్రీ చదవాలని ఎంచుకున్న విద్యార్థులు మాత్రం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌లో ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదల చేయగా మూడు నెలల తర్వాత డిగ్రీ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. డిగ్రీ అడ్మిషన్‌ దరఖాస్తు ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్‌ అమలులో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు అడ్మిషన్ల ప్రక్రియకు అనుసరించాల్సిన విధి విధానాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కోన శశిధర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్ట్స్‌, సైన్స్‌, సోషల్‌, కామర్స్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుల్లో బీఏ, బీఎస్సీ, బీకాం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు అనుమతి మంజూరు చేసింది.

ఆన్‌లైన్‌ మొరాయింపు

డిగ్రీ అడ్మిషన్‌లకు మొదటి నుంచే ఆన్‌లైన్‌ మొరాయిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో సైతం దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతిచ్చారు. అయితే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే కళాశాలల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తే ప్రిన్సిపల్స్‌ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. విద్యార్థి ఏ కళాశాలలో అయితే దరఖాస్తు చేస్తారో ఆ కళాశాలను, అక్కడి కోర్సులను ప్రథమ ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందజేసే విద్యార్థులు దరఖాస్తుతో పాటు అడ్మిషన్లు పొందే కళాశాలల్లో కోర్సులను వరుస క్రమంలో పేర్కొనాలి.

మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ విధానం అమలు

డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. రిజర్వుడ్‌ కేటగిరీ విద్యార్థులకు వారి రిజర్వేషన్‌ ప్రకారం అడ్మిషన్‌ సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ విద్యార్థులకు మొత్తం సీట్లల్లో 15 శాతం కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్‌లను వర్గీకరణ ప్రకారం అమలు చేస్తారు. గ్రూపు–1లోని 12 కులాలకు 1 శాతం, గ్రూపు–2లోని 18 కులాలకు 6.5 శాతం, గ్రూపు–3 లోని 29 కులాలకు 7.5 శాతం చొప్పున 15 శాతం సీట్లు కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement