
నేరుగా అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్లు చేసుకుంటారని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, పార్శికులు, బౌద్ధులు, జైనులు అడ్మిషన్లు పొందాలన్నారు. 5 నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. 5వ తరగతిలో 61, ఆరో తరగతిలో 50, ఏడో తరగతిలో 42, 8వ తరగతిలో 41 సీట్లు ఖాళీలున్నాయన్నారు. అడ్మిషన్లు పొందే విద్యార్థులకు విద్యతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం, కాస్మొటిక్ చార్జీలు, వైద్య సౌకర్యం, పాఠ్యపుస్తకాలు అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు 8712625058 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
సమష్టి కృషి వల్లే
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్
చిత్తూరు అర్బన్ : నగరపాలక అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఉత్తమ ర్యాంక్ సాధ్యమైందని మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక కార్యాలయంలో అధికారులు, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేసీ్త్రలు, కార్మికులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కార్మికులను ఆత్మీయంగా సత్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రక్రియకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, సహాయ కమిషనర్ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, ఎంఈ వెంకటరామిరెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఇన్‌చార్జ్ మేనేజర్ గోపాలకృష్ణవర్మ, ఎంహెచ్‌వో లోకేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.