
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 75,104 మంది స్వామివారిని ద ర్శించుకోగా 31,896 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శ నం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
సూర్యప్రభపై కుమారస్వామి చిద్విలాసం
శ్రీకాళహస్తి: విజ్ఞానగిరిపై ఉన్న కుమారస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. విశేషంగా అలంకరించి, ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి, పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
మహిళపై టీడీపీ శ్రేణుల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: కుమార్తైపె అసభ్యకరంగా ప్రవరించారని ప్రశ్నించినందుకు ఓ మహిళపై టీడీపీ శ్రేణులు దాడిచేసిన ఘటన చిత్తూరు మండలం, పచ్చనపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు .. పచ్చనపల్లినికి చెందిన కల్వి(43) కుమార్తె నీళ్లు తెస్తున్న క్రమంలో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం కుమార్తె తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులను ప్రశ్నించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆ యువకుడు వారి కుటుంబీకులు (టీడీపీ శ్రేణులు) బండ బూతులు తిడుతూ కల్విని కర్రలతో చితక్కొట్టారు. దీంతో కల్వి తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, నలుగురు వ్యక్తులు తమపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని కల్వి, అతని భర్త చుక్క లింగం పేర్కొన్నారు.