
కుటుంబ కలహాలకు అ‘బలి’
పాకాల: భార్యపై అనుమానం.. కుటుంబ కలహాలు.. హతుడికి మానసిక రోగం.. వెరసి అబలతోపాటు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. మద్దినాయనపల్లి పంచాయతీ పెద్దహరిజనవాడ గ్రామానికి చెందిన గిరి తన అక్క ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలను తీసుకుని వస్తూ మార్గం మధ్యలోని తన తండ్రి వర్ధంతి సందర్భంగా సమాది వద్ద పూజలు చేశాడు. అనంతరం అదే దారిలోని బావిలో భార్యబిడ్డలను తోసి హతమార్చాడు. గిరి తిరుపతిలో ఎలక్ట్రీషియన్ పని చేస్తుండగా అతడి భార్య హేమంతకుమారి(33) లీలామహల్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తోంది. వీరికి పెద్ద కుమార్తె తనుశ్రీ(10), రెండవ కుమార్తె తేజశ్రీ(6) పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గిరి కుటుంబంతో తిరుపతిలోనే జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల కిందట గిరి పులిచెర్ల మండలం ఈ–రామిరెడ్డిగారిపల్లిలోని తన అక్కగారి ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడే మూడు రోజులు గడిపాడు. గురువారం తన తండ్రి వర్దంతి సందర్భంగా తిరిగి తన స్వగ్రామామైన పెద్దహరిజనవాడకు బయలుదేరాడు. మార్గం మధ్యలోని తన తండ్రి సమాది వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశాడు. ఆ తరువాత బయలుదేరి అదే మార్గంలోని కొత్త ఒడ్డిపల్లి గంగనబోయని బావి వద్దకు వారిని తీసుకెళ్లి, భార్యా బిడ్డలను బావిలోకి తోసేశాడు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాత తాను బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం హతుడు ఆత్మహత్యకు పాల్పడే ముందు తన సోదరుడికి ఫోన్‌లో చెప్పడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే తల్లీబిడ్డలు మరణించారు. గిరిని వారు కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాగా రెండు మూడు రోజులుగా గిరి మానసిక పరిస్థితి బాగా లేదని హతుడి సమీప బంధువులు చెబుతున్నారు. అలాగే కుటుంబ కలహాల కారణంగానే వారిని హత్య చేశారని మృతుల బంధువులు చెబుతున్నారు. బొమ్మల్లాంటి బిడ్డలను హతమార్చడానికి నీకు చేతులు ఎలా ఆడాయిరా నాయనా అని మృతుల బంధులు రోదనలు చూసిన వారి కంట తడి పెట్టిస్తున్నాయి. కాగా హతుడు గిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలకు అ‘బలి’