
రేపటి నుంచి అభినయ ఆర్ట్స్ జాతీయ నాటకోత్సవాలు
తిరుపతి కల్చరల్: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో అభినయ ఆర్ట్స్ వారి రజతోత్సవాల్లో భాగంగా ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో జాతీయ స్థాయి హనుమ అవార్డ్స్ నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బీఎన్.రెడ్డి తెలిపారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభినయ ఆర్ట్స్ 25వ వార్షికోత్సవంలో భాగంగా రజతోత్సవ వేడుకలుగా ఈ జాతీయ స్థాయి నృత్య, నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు రోజు ఉదయం 9.30 నుంచి రాత్రి 9 గంటల వరకు శాసీ్త్రయ, జానపద బృంద నృత్యాలు, పౌరాణిక, సాంఘిక నాటికల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాబృందాల చే 8 పౌరాణిక పద్యనాటకాలు, 11 సందేశాత్మకమైన సాంఘిక నాటికలు అద్భుత రీతిలో ప్రదర్శన ఉంటుందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి హనుమ అవార్డులతో పాటు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అభినయ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు ఎన్.విశ్వనాథరెడ్డి, గౌరవ సలహాదారుడు దామోదర గుప్త, ఉపాధ్యక్షుడు ధర్మయ్య పాల్గొన్నారు.