రైతుకు పరీక్షే! | - | Sakshi
Sakshi News home page

రైతుకు పరీక్షే!

Jul 17 2025 3:34 AM | Updated on Jul 17 2025 3:34 AM

రైతుక

రైతుకు పరీక్షే!

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు.. సాగు ఖర్చులు తగ్గించేందుకు చేపట్టే భూసార పరీక్షలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. దాదాపు ఏడాదిగా ఒక్కరూపాయీ విదల్చకుండా రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. మట్టి నమూనాలు సేకరించినా ఫలితాలు ఇవ్వకుండా వేధిస్తోంది. నేల స్వభావం తెలియక అధిక పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి రసాయన ఎరువులు వాడాలో కూడా చెప్పేవారు కరువవడం విమర్శలకు తావిస్తోంది.

ఇష్టారాజ్యం

మట్టి నమూనాల సేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ ప్రకారమే సేకరించాల్సి ఉంది. గ్యాప్‌ పొలంబడి నిర్వహించే ప్రాంతాలు, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, ఆయిల్‌ సీడ్స్‌ ప్రదర్శనా క్షేత్రాలు.. తదితర ప్రాంతాల్లోనే మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. 2024–25లో మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సేకరించి మమ అనిపించారు. దీంతో భూసార పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే మట్టి నమూనాల సేకరణ ప్రహసనంగా మారింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా మట్టినమూనాలు సేకరిస్తుండడంతో భూసార పరీక్షల్లో పారదర్శకత లేకుండా పోయింది.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): భూసార పరీక్షలతో సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది జిల్లాలో 27 వేల భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇంతవరకు మట్టి నమూనాల సేకరణ, రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం మినహా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.

రైతుల పాలిట శాపం

భూసార పరీక్షల్లో ఉదజని సూచిక, స్థూల పోషకాలైన భాస్వరం, నత్రజని, పోటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్‌, కాల్షియం, క్లోరిన్‌, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, సల్ఫర్‌, కాపర్‌, మాలిబ్డినం తదితర 15 పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్దేశం మంచిదే అయినా భూసార పరీక్షల నిర్వహణలో చిత్తశద్ధి లోపించడం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో 502 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో దానినుంచి 55 మట్టి నమూనాలు సేకరిం చాల్సి ఉంది. ఇలా 2,796 మట్టి నమూనాలు సేకరించేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 26,948 నమూనాలను సేకరించినట్లు అధికారులు లెక్కలుగట్టారు.

సేకరించిన నమూనాలు.. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చే స్తారు. తర్వాత మట్టి నమూనాలను సంబంధిత భూసార పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. కానీ ఇంతవరకు భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయీ విదల్చలేదు. కెమికల్స్‌ లేవు. ఇన్ని సమస్యల మధ్య భూసార పరీక్ష ఫలితాలు ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

చిత్తూరులో మాత్రమే...

చిత్తూరు నగరంలోని మార్కెట్‌ యార్డులో ఉన్న భూసార పరీక్షల కేంద్రానికి మాత్రమే పరీక్షలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయి. కుప్పంలోని కేంద్రానికి అనుమతులు ఇవ్వలేదు. అయితే చిత్తూరులోని భవనం పాడుబడింది. వీటి మరమ్మతులకు ప్రభుత్వం రూ.9 లక్షలు మంజూరు చేసింది. గత నాలుగు నెలలకు కిత్రం నిధులు కేటాయించినా ఇంతవరకు ఆ భవనం భూసార పరీక్షలకు సిద్ధం కాలేదు. వచ్చే నెలకు పూర్తి కావొచ్చన్ని అధికారులు భావిస్తున్నారు.

అస్తవ్యస్తం

భూసార పరీక్షల్లో నాణ్యత ఉండాలంటే తగిన మోతాదులో రసాయనాలు వినియోగించాలి. ఇందుకు ఈ ఏడాది ఒక్క రూపాయీ విడుదల కాలేదు. రసాయనాలు లేవు. గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ భూసార పరీక్షలంటూ హంగామా చేసిందే తప్ప.. ఫలితాలను రైతులకు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి 2024–25లో కూడా పునరావృతమైంది. 2025–26లో భూసార పరీక్షల నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మట్టి నమూనాలు సేకరిస్తున్న దృశ్యం

ఖరీఫ్‌ మొదలైనా ఊసేలేని భూసార పరీక్షలు

ఇష్టారాజ్యంగా మట్టి నమూనాల సేకరణ

సిద్ధం కాని పరీక్ష కేంద్రం

అవస్థల్లో అన్నదాతలు

మరమ్మతులు జరుగుతున్నాయి

ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలో 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలు ఇచ్చాం. ప్రస్తుతం రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ చేసిన తర్వాత మట్టి నమూనాలు ల్యాబ్‌కు వస్తాయి. ల్యాబ్‌ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే పరీక్షలు ప్రారంభమవుతాయి.

–మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, చిత్తూరు

రైతుకు పరీక్షే!1
1/1

రైతుకు పరీక్షే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement