
గర్భవతిని రైలు నుంచి కిందికి తోసిన యువకుడికి జీవిత ఖైదు
● బాధిత కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని రైలులో గర్భవతిపై అత్యాచారానికి యత్నించి రైలు నుంచి కిందకు తోసి వేసిన యువకుడికి జీవిత శిక్ష విదించడంతో పాటూ బాఽధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని తిరుపత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు.. ఆంఽధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భవతి ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదిన తిరుప్పూరు నుంచి తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరింది. ఆ సమయంలో వేలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామానికి చెందిన హేమరాజ్ అదే రైలులో వస్తూ గర్భవతిని లైంగికంగా వేధించాడు. బాధితురాలు కేకలు వేయడంతో రైలు నుంచి కిందకు తోసి వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమెకు కాళ్లు, చేతులు విరగడంతో పాటూ ముఖం పూర్తిగా దెబ్బతినడంతో ఆమెను చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలులో ఉంచారు. ఈ కేసు విచారణ తిరుపత్తూరు కోర్టులో జరుగుతుంది. తుది తీర్పు సోమవారం సాయంత్రం న్యాయమూర్తి మైనా కుమారి ముందుకు వచ్చింది. నిందితుడు హేమరాజ్‌కు జీవిత శిక్ష విధించడంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు, రైల్యే శాఖ రూ. 50 లక్షలు చొప్పున మొత్తం రూ. కోటి బాధిత కుటుంబానికి అందజేయాలని న్యాయమూర్తి తీర్పిచ్చారు.