గెలుపే లక్ష్యం.. సమష్టిగా పయనం | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యం.. సమష్టిగా పయనం

Published Thu, Apr 18 2024 10:40 AM

సొంత గూటికి చేరుకున్న నేతలతో మంత్రి రోజా  - Sakshi

విభేదాలు వీడి ఏకమైన నేతలు

మంత్రి రోజా వెంటే నడుస్తామని ప్రకటన

పుత్తూరు : వారందరూ వైఎస్సార్‌సీపీ నేతలే.. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన వారే.. అయితే ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ విద్రోహులు అపోహలు సృష్టించడంతో మంత్రి ఆర్‌కే రోజాకు దూరమయ్యారు. పరిస్థితుల కారణంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే కాలం వారి మధ్య ఉన్న దూరాన్ని తొలగించింది. నిజానిజాలను పార్టీ నేతలు తెలుసుకున్నారు. ఇంతకాలం మంత్రితో తమకున్న అనుబంధాన్ని దూరం చేసింది అపోహలే వారికి స్పష్టంగా అర్థమైంది. ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా మంత్రి రోజా, ఆమె భర్త ఆర్‌కే సెల్వమణి వద్దకు తమ అనుచరగణంతో కలిసి పరుగుపరుగున వచ్చేశారు. అపోహల వీడి ఆప్యాయతలను పంచుకున్నారు. రోజమ్మతోనే ఇక తమ ప్రయాణమని, సమష్టిగా ఆమె గెలుపునకు ఎన్నికల్లో పనిచేస్తామని ప్రకటించారు. నేతలందరూ ఒక్కతాటిపైకి రావడంతో వైఎస్సార్‌సీపీ బలాన్ని ఇనుమడింపజేసింది. బుధవారం ఈ ఘటన పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో చోటుచేసుకుంది. కేబీఆర్‌పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాప్‌, తిరుమలకుప్పం గ్రామానికి చెందిన సంపత్‌, కృష్ణసముద్రానికి చెందిన రవి, బాబు గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు అహర్నిశలు శ్రమించారు. తర్వాత కొన్ని పొరపొచ్చాలు రావడంతో మంత్రి రోజాతో విభేదించారు. ఇటీవల సందర్భోచితంగా వారు కలుసుకున్న సమయంలో వాస్తవం తెలియవచ్చింది. ఇంతకాలం అనవసరంగా మంత్రికి దూరంగా ఉన్నామని వారు తెలుసుకున్నారు. కేబీఆర్‌ పురం గ్రామానికి విచ్చేసిన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక మంత్రి వెంటే ఉంటామని, ఏ శక్తులూ మమ్మల్ని విడదీయలేవని ప్రకటించారు. పార్టీకి దూరమై టీడీపీలోకి చేరిన వారి అనుచరులను సైతం తీసుకువచ్చి వైఎస్సార్‌సీపీలో చేర్చారు. నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి కలుసుకోవడం కార్యకర్తల్లో ఆనందం నింపింది. కేబీఆర్‌పురం జనంతో నిండింది.. విజయహోరు వినిపించింది. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ దూరమైన సేనాధిపతులు మళ్లీ వచ్చారని, రెట్టింపుబలం వచ్చిందన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు ఇది శుభపరిణామమని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ మునివేలు, పార్టీ మండల అధ్యక్షుడు గోవిందస్వామి రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, జేసీఎస్‌ కన్వీనర్‌ భాస్కర్‌ యాదవ్‌, నాయకులు లక్ష్మణమూర్తి, వెంకటేష్‌, సుదర్శనం పాల్గొన్నారు.

మంత్రి ఆర్‌కే రోజాతో వైఎస్సార్‌సీపీ నేతలు
1/1

మంత్రి ఆర్‌కే రోజాతో వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement
 
Advertisement
 
Advertisement