చివరి గంటలో కొనుగోళ్లు 

Sensex Up 581 pts Nifty Ends Above 16K In Trade Metals Bleed IT Gains - Sakshi

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌  

సూచీలకు ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌  

బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల రికవరీ ర్యాలీ 

ఐటీ, ఫార్మా షేర్లకు భారీ డిమాండ్‌ 

సెన్సెక్స్‌ లాభం 581 పాయింట్లు  

కనిష్ట స్థాయి నుంచి 1213 పాయింట్లు జంప్‌  

మళ్లీ 16 వేల స్థాయిపైకి నిఫ్టీ

ముంబై: చివరి గంటలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్‌ సూచీలు నాలుగురోజుల నష్టాల తర్వాత మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీయే అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి చేరుకోవడంతో ఎగుమతులపై ఆదాయాలను ఆర్జించే ఫార్మా, ఐటీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఇటీవల దిద్దుబాటుతో భారీ నష్టపోయిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్‌ 581 పాయింట్లు పెరిగి 53,424 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 16000 స్థాయిని తిరిగి దక్కించుకుని 150 పాయింట్ల లాభంతో 16,013 వద్ద నిలిచింది. మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి.

సూచీల అనూహ్య రికవరీతో ఇన్వెస్టర్లు రూ.2.51 లక్షల కోట్లను గడించారు. ఫలితంగా బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.243 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.8,142 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.6,490 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ స్వల్పంగా మూడు పైసలు బలపడి 76.90 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనల ప్రభావం కొనసాగుతోంది. ఆసియాలో అన్ని దేశాల స్టాక్‌ సూచీ లు నష్టాలతో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు అతిస్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నాయి. 

నష్టాల్లోంచి లాభాల్లోకి... 
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలతో దేశీయ మార్కెట్‌ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 413 పాయింట్లు పతనమై 52,430 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లను కోల్పోయి 15,748 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిసెషన్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్‌ 582 పాయింట్లు క్షీణించి 52,261 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు క్షీణించి 15,671 ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

అయితే మిడ్‌సెషన్‌ నుంచి సూచీలు కోలుకోవడం ప్రారంభించాయి.  ట్రేడింగ్‌ మరోగంటలో ముగుస్తుందన్న తరణంలో కొనుగోళ్లు మరింత వేగవంతమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం (52,261)నుంచి 1223 పాయింట్లు ఎగసి 53,484 వద్ద, నిఫ్టీ డే కనిష్టస్థాయి (15,671) 358 పాయింట్లు లాభపడి 16,029 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
►సెన్సెక్స్‌ సూచీలో సన్‌ఫార్మా షేరు అధికంగా 4% లాభపడింది. టీసీఎస్, ఎన్‌టీపీసీ, విప్రో, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్, ఆల్ట్రాటెక్‌ సిమెంట్, ఇన్ఫోసిస్‌ షేర్లు 2% ర్యాలీ చేశాయి. 
►సీఎన్‌జీ ధరలు పెరగవచ్చనే అంచనాలతో ఐజీఎల్, ఎంజీఎల్‌ షేర్లు వరుసగా 10%, 7% చొప్పున లాభపడ్డాయి.
►వ్యాపార అవసరాలకు అమెరికన్‌ యాక్సిల్‌ మానుఫ్యాక్చరింగ్‌తో జతకట్టడంతో రామకృష్ణ ఫోర్జింగ్‌ షేరు ఆరుశాతం లాభపడి రూ.830 వద్ద నిలిచింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top