మళ్లీ 18000 పైకి నిఫ్టీ

Nifty Regains 18000 But Analysts Still Remain Cautious - Sakshi

ముంబై: సంవత్‌ 2078 ఏడాది రెండోరోజూ స్టాక్‌ సూచీలు లాభాలన్ని ఆర్జించాయి. దేశీయంగా నెలకొన్న సానుకూలతలతో పాటు ఫారెక్స్‌ మార్కెట్‌ నుంచి రూపాయి ర్యాలీ కలిసిరావడంతో సోమవారం సెన్సెక్స్‌ 478 పాయింట్లు పెరిగి 60,546 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్లు లాభపడి 18వేల పైన 18,069 వద్ద నిలిచింది. ఆర్థిక, ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, ఇంధన, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. మరోవైపు ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్‌ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ పండుగ సీజన్‌ అమ్మకాలు(రూ.1.25 లక్షల కోట్లు) ఆర్థికవేత్తల అంచనాలను మించి నమోదయ్యాయి. మూడు కంపెనీలు ఈ వారంలో ఐపీఓల ద్వారా రూ.21 వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైన వేళ దేశీయ ప్రాథమిక మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయనే ఆశలు నెలకొన్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ వేగం పుంజుకుందని ఇండస్ట్రీ చాంబర్‌ పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. గత వారంలో విడుదలైన దేశీయ సేవా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించగలిగాయి. జీఎస్టీ అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో వసూలైంది. కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 830 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 252 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల షేర్లను కొనగా. దేశీయ ఇన్వెస్టర్ల రూ.1911 కోట్ల షేర్లను విక్రయించారు. అమెరికా, చైనా దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి సూచీల భారీ ర్యాలీతో బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో రూ.2.45 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.267 లక్షల కోట్లకు చేరింది.  

830 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్‌ 
స్టాక్‌ సూచీలు ఉదయం భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 319 పాయింట్లు పెరిగి 60,386 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు పెరిగి 18,040 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 830 పాయింట్ల పరిధిలో 60,609 వద్ద గరిష్టాన్ని 59,779 వద్ద కనిష్టాన్ని నమోదుచేసింది. నిఫ్టీ 252 పాయింట్ల రేంజ్‌లో 18,088 – 17,836 శ్రేణి మద్య ట్రేడైంది.

‘‘వ్యాక్సినేషన్‌ వేగవంతంతో పాటు పండుగ సీజన్‌ సందర్భంగా పరిశ్రమ, కస్టమర్ల వినియోగ సెంటిమెంట్‌ మెరుగుపడటంతో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ వేగం పుంజుకుందని పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. పెట్రోల్, డిజిల్‌పై కేంద్రం సుంకాన్ని తగ్గించడంతో 22 రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా వృద్ధిని చెందుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టవచ్చు. అందుకే ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ.., కొనుగోళ్లకే మొగ్గుచూపారు’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఎస్‌ రంగనాథన్‌ తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
సాంకేతిక లోపంతో కస్టమర్ల అనుమతి లేకుండానే ఈ ఏడాది మేలో 83 వేల రుణాలు ముంజూరు చేసినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఒప్పుకొంది. ఫలితంగా ఈ బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 11% పతనమైన రూ.1,061 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనం నేపథ్యంలో కంపెనీ ఒక్కరోజులోనే రూ.9851 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది. రానున్న రోజుల్లో సిమెంట్‌ బస్తా ధర పెరగవచ్చనే అంచనాలతో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 4% లాభంతో రూ.8212 వద్ద ముగిసింది. రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో దివీస్‌ ల్యాబ్‌ షేరు ఆరుశాతానికి పైగా నష్టపోయి రూ.4876 వద్ద నిలిచింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top