మార్కెట్‌ క్రాష్‌.. లక్షల కోట్ల సంపద ఆవిరి.. కారణాలు ఇవేనా?

Market Crash Dalal Street Four Reasons Behind Free Fall Of Desi Indices - Sakshi

ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి వార్తలు..

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కీలకం 

ప్రపంచ పరిణామాలపైనా దృష్టి 

ఈ వారం ట్రేడింగ్‌పై స్టాక్‌ నిపుణుల అంచనా   

స్టాక్‌ మార్కెట్‌ బ్లాక్‌మండేను తలపిస్తోంది. మార్కెట్‌ ప్రారంభం కావడం ఆలస్యం ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, అటు నిఫ్టీలు వరుసగా నష్టాల పాలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1420 పాయింట్లు నష్టపోయింది. దాదాపు 2.50 శాతం మార్కెట్‌ క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 435 పాయింట్లు నష్టపోయి 16,549 పాయింట్ల దగ్గర ట్రేడవుతూ 2.56 శాతం క్షీణించింది. దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఈ క్రమంలో నిపుణులు ఈ వారం స్టాక్‌మార్కెట్‌ తీరుతెన్నులపై పలు సూచనలు చేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, ఒమిక్రాన్‌ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా ఈ వారం ట్రేడిండ్‌లో కరెక‌్షన్‌ ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. 

కరెక్షన్‌ కొనసాగవచ్చు 
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల వ్యాప్తి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయ వార్తలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను ప్రేరేపించవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికలపై మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.  ‘‘ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీపై కఠిన వైఖరి పంథాను ఎన్నుకోవడంతో గత శుక్రవారం మార్కెట్లో బేరిష్‌ వాతావరణం నెలకొంది. దేశీయ మార్కెట్‌ ఉత్సాహాన్నిచ్చే ఈవెంట్‌లేవీ లేకపోవడంతో కరెక్షన్‌ కొనసాగవచ్చు’ అని స్వస్తిక్‌ ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు. అధిక వడ్డీరేట్ల భయాలతో పాటు ఎఫ్‌ఐఐల వరుస అమ్మకాలతో గతవారంలో సెన్సెక్స్‌ 1,775 పాయింట్లు, నిఫ్టీ 526 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే.  

ఒమిక్రాన్‌ భయాలు 
కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభణతో ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ అంతకంతా బలహీనపడుతోంది. వైరస్‌ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. యూరప్‌ తరహా వ్యాధి సంక్రమణ భారత్‌లో జరిగితే రోజుకు 14 లక్షల కేసులు నమోదుకావచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పౌల్‌ హెచ్చరించారు. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. 

విదేశీ విక్రయాలు 
దేశీయ మార్కెట్లో రెండు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్‌లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో రూ.13,470 కోట్ల ఈక్విటీ మార్కెట్‌ నుంచి, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.4066 కోట్లు, హైబ్రిడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నుంచి రూ.160 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఎఫ్‌ఐఐల వరుస విక్రయాలు దేశీయ మార్కెట్‌కు అత్యంత ప్రతికూలంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో అస్థితరత తగ్గితే ఎఫ్‌ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు.  

ప్రపంచ పరిణామాలు 
దేశీయంగా స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపై దృష్టిసారించనున్నారు. అమెరికా బుధవారం(22న) మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలతో పాటు నవంబర్‌ గృహ అమ్మకాల డేటాను విడుదల చేయనుంది. అదే రోజున బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ద్రవ్య పాలసీ మినిట్స్‌ వెల్లడి కానున్నాయి. ఇదే వారంలో గురువారం యూఎస్‌ ఉద్యోగ గణాంకాలు..., శనివారం జపాన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సూచించే ఈ గణాంకాలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు. 

చదవండి: ఒమిక్రాన్‌ భయాలు.. బేర్‌ పంజా.. అరగంటలోనే భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top