గోల్డ్‌ రికార్డ్ ‌: వెండి హైజంప్‌

Gold soars to all-time high - Sakshi

జిగేల్‌మంటున్న పసిడి ధర

రూ.51,833 వద్ద కొత్త ఆల్‌టైం హై

అంతర్జాతీయంగానూ జీవితకాల గరిష్టానికి

కొండెక్కిన వెండి ధర 

కేజీ వెండి రూ.3673 జంప్‌

దేశీయంగా బంగారం, వెండి ధరలు ధగధగలాడుతున్నాయి. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర కొత్త ఆల్‌టైకి హైని అందుకుంది. కేజీ వెండి ధర రూ.3626 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం కొత్త రికార్డు స్థాయిని అందుకోవడంతో పాటు నేడు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌ బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. అలాగే రానున్న రోజుల్లో పెళ్లిళ్ల, పండుగల సీజన్‌ కారణంగా బంగారం ధర మరింత పెరిగినట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. నేడు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర శుక్రవారం ముగింపు(రూ.51035)తో పోలిస్తే రూ.714ల భారీ లాభంతో మొదలైంది. ఒకదశలో దాదాపు రూ.800లు వరకు పెరిగి రూ.51,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర దేశీయంగా బంగారానికి కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:30ని.లకు రూ.714 లాభంతో రూ.51749 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అంతర్జాతీయంగానూ కొత్త ఆల్‌టైంకి: 
అంతర్జాతీయంగానూ బంగారం సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 40డాలర్ల పెరిగి 1,937.60 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకున్నాయి. అమెరికా-చైనాల మద్య కొనసాగుతున్న కొత్త వాణిజ్య ఉద్రిక్తతలతో డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల కనిష్టానికి కరిగిపోయింది. అలాగే కరోనా వ్యాధితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు కారణాలు బంగారం పరుగులు పెట్టేందుకు కారణమైనట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు.

వెండి రూ.3673లు జంప్‌: 
వెండి ధర కూడా కొండెక్కింది. నేడు కేజీ వెండి ధర రూ.3626 పెరిగింది. బంగారం ధరతో పోలిస్తే వెండిధర రేషియో చాలా తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు గత 10రోజులుగా వెండి కొనుగోళ్లను మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా గడిచిన 10ట్రేడింగ్‌ సెషన్లలోనే ఇండియాలో వెండి ధర రూ.20వేలు పెరిగింది. అందులో భాగంగా నేడు రూ.3673 పెరిగి రూ.64,896.00 స్థాయిని తాకింది. గతవారంలో వెండి ధర 15శాతం పెరిగిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top