రికార్డ్‌ గరిష్టాల నుంచి బంగారం, వెండి బోర్లా

Gold, Silver prices retreats from record highs - Sakshi

ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 1056 పతనం

అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ. 54,789కు

రూ. 1892 క్షీణించిన సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ వెండి 

రూ. 74,160 వద్ద ముగిసిన కేజీ వెండి ధర 

న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి 41 డాలర్లు డౌన్‌

వెండి ఔన్స్‌ 3 శాతం నష్టంతో 27.54 డాలర్లకు

కొద్ది రోజులుగా దేశ, విదేశీ మార్కెట్లో సరికొత్త రికార్డులను సాధిస్తూ వచ్చిన బంగారం, వెండి ధరలకు వారాంతాన బ్రేక్‌ పడింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 1056 పతనమైంది. అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ. 54,789 వద్ద ముగిసింది. ఈ బాటలో సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ వెండి కేజీ ధర రూ. 1892 క్షీణించి రూ. 74,160 వద్ద నిలిచింది. అంతకుముందు ట్రేడింగ్‌ ప్రారంభంలో పసిడి గరిష్టంగా రూ. 56,191ను తాకింది. ఇదే విధంగా వెండి రూ. 77,949కు చేరింది. తద్వారా ఇంట్రాడేలో బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌ చరిత్రలో సరికొత్త గరిష్టాలను సాధించిన సంగతి తెలిసిందే. 

కామెక్స్‌లో డీలా
శుక్రవారం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 41 డాలర్లు పడిపోయి 2,028 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్‌ మార్కెట్లోనూ 28 డాలర్లు క్షీణించి 2,036 డాలర్ల దిగువన స్థిరపడింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 3 శాతం నష్టంతో 27.54 డాలర్ల వద్ద నిలిచింది. అయితే రికార్డ్‌ ర్యాలీని కొనసాగిస్తూ శుక్రవారం ఉదయం పసిడి 2,089 డాలర్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. స్పాట్‌ మార్కెట్లోనూ 2,075 డాలర్లవరకూ ఎగసింది. ఇదేవిధంగా వెండి 2013 తదుపరి గరిష్టంగా 29.92 డాలర్లకు చేరింది.

కారణాలేవిటంటే?
జులై నెలకు యూఎస్‌ వ్యవసాయేతర రంగంలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి.  1.76 మిలియన్లకు చేరినట్లు యూఎస్‌ కార్మిక శాఖ తాజాగా వెల్లడించింది. జూన్‌లో నమోదైన 4.8 మిలియన్లతో పోలిస్తే ఇవి అత్యంత తక్కువే అయినప్పటికీ అంచనాల(1.6 మిలియన్లు)కంటే అధికమేనని విశ్లేషకులు తెలియజేశారు. దీంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగి ఇటీవల రెండేళ్ల కనిష్టానికి చేరిన డాలరు ఇండెక్స్‌ 0.7 శాతం బలపడి  93.44కు చేరింది. అదీకాకుండా గత వారం రోజుల్లోనే పసిడి ధరలు దాదాపు 5 శాతం జంప్‌చేయడంతో ట్రేడర్లు ఫ్యూచర్స్‌లో భారీగా లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. బంగారం, వెండి ధరలు ఓవర్‌బాట్‌ స్థితికి చేరడంతో సాంకేతికంగా దిద్దుబాటు వచ్చినట్లు మరికొంతమంది నిపుణులు వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top