రిస్క్‌– రాబడుల సమతుల్యం

Details about Canara Robeco Equity Hybrid Fund - Sakshi

కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ రివ్యూ

రాబడులు కావాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ కూడా ఉండాలి. అంతేకానీ, పెట్టుబడిని రాబడుల కోసం రిస్క్‌లో పెట్టుకోవాలని ఏ ఇన్వెస్టర్‌ కూడా అనుకోరు. అయినప్పటికీ రాబడులపైనే దృష్టితో రిస్క్‌ కోణాన్ని కొందరు విస్మరిస్తుంటారు. ముఖ్యంగా జీవిత లక్ష్యాల కోసం చేసే పెట్టుబడుల్లో కచ్చితంగా రక్షణ/రిస్క్‌ కోణాన్ని చూడాల్సిందే. అసలు రిస్క్‌ వద్దనుకుంటే అప్పుడు రాబడుల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. అందుకనే ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ.. వీలైనంత మేర మెరుగైన రాబడులను ఇచ్చే దిశగా హైబ్రిడ్‌ ఫండ్స్‌ పనిచేస్తుంటాయి. ఇందులో మెరుగైన రాబడులు కోరుకునే వారికి అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. వీటినే అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ అని కూడా పిలుస్తారు. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులను 65–80 శాతం వరకే ఈ పథకాలు పరిమితం చేస్తుంటాయి. కనుక ఈక్విటీల అస్థిరతల ప్రభావం పెట్టుబడులపై ఆ మేరకే ఉంటుంది. 
పెట్టుబడుల విధానం 
అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకాలు ఈక్విటీలతోపాటు డెట్‌ సాధనాల మధ్య పెట్టుబడులను నిర్వహిస్తుంటాయి. ఈక్విటీల వ్యాల్యుయేషన్స్‌ (స్టాక్స్‌ విలువలు) ఆకర్షణీయంగా ఉన్న సందర్భాల్లో మొత్తం పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఈక్విటీల కేటాయించి మిగిలిన 20 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అదే విధంగా ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా మారాయని భావించి సందర్భాల్లో ఈక్విటీ కేటాయింపులను 65 శాతానికి పరిమితం చేసి, డెట్‌ సాధనాల్లో అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలా పరిస్థితులకు తగినట్టు మార్పులు చేస్తూ అధిక రాబడులను ఇచ్చే విధంగా ఈ పథకాలు పనిచేస్తుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఈక్విటీల విలువలు చారిత్రక గరిష్టాలకు చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్‌ పథకం తన ఈక్విటీ పెట్టుబడులను 65 శాతానికి తగ్గించుకుంది. తర్వాత నెల రోజులకే మార్కెట్లు భారీ పతనాలను చవిచూశాయి. దిద్దుబాటు అనంతరం ఈక్విటీల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 74.8 శాతానికి ఈక్విటీ పెట్టుబడులను పెంచుకుంది. దీర్ఘకాలంలో ఇటువంటి పెట్టుబడుల వ్యూహాలు మెరుగైన రాబడులను సమకూర్చుకునేందుకు అనుకూలిస్తాయి.  
పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.6,091 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 71.4 శాతం ఈక్విటీల్లో, డెట్‌లో 24 శాతం ఇన్వెస్ట్‌ చేసి ఉంది. మరో 5 శాతం ఆస్తులను నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీ మార్కెట్‌ జీవిత కాల గరిష్టాలకు సమీపంలో ట్రేడవుతున్నాయి. ఒకవేళ దిద్దుబాటు చోటుచేసుకుంటే ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుగా కొంత నగదును కలిగి ఉంది. ఈక్విటీల్లో 52 స్టాక్స్‌ను కలిగి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 22 శాతం పెట్టుడులను వీటిల్లోనే ఇన్వెస్ట్‌ చేసి ఉంది. తర్వాత టెక్నాలజీ రంగ స్టాక్స్‌కు 10 శాతం, ఆటోమొబైల్‌ రంగ స్టాక్స్‌కు 7.54 శాతానికి పైగా కేటాయింపులు చేసింది.  
రాబడులు  
ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 35 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో వార్షిక రాబడులు 20 శాతం చొప్పున ఉన్నాయి. అదే విధంగా ఐదేళ్లలో 15.54 శాతం, ఏడేళ్లలో 13.35 శాతం, పదేళ్లలోనూ 15 శాతానికి పైనే వార్షిక రాబడులను అందించి ఈ విభాగంలో టాప్‌ పథకాల్లో ఒకటిగా నిలిచింది. ఒక్క ఏడాది కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ సూచీల కంటే మెరుగైన రాబడులను అందించింది ఈ పథకం.  రిస్క్‌ ఇంకా తక్కువే ఉండాలనుకునే వారు అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ డెట్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇందులో అధిక భాగం డెట్‌కు, తక్కువ భాగం ఈక్విటీలకు కేటాయిస్తారు. అయితే, ఈక్విటీల్లో స్వల్పకాలంలోనే రిస్క్‌ ఉంటుంది కానీ, దీర్ఘకాలంలో కాదు. చరిత్రను పరిశీలిస్తే ఇదే తెలుస్తుంది. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడమే మంచిది.  
టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
కంపెనీ               పెట్టుబడుల శాతం 
ఐసీఐసీఐ బ్యాంకు              5.91 
ఇన్ఫోసిస్‌                          5.38 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు         4.90 
ఎస్‌బీఐ                             3.31 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌        3.21 
బజాజ్‌ ఫైనాన్స్‌                2.83 
ఎల్‌అండ్‌టీ                     2.49 
టీసీఎస్‌                           2.45 
హెచ్‌డీఎఫ్‌సీ                   2.18 
యాక్సిస్‌ బ్యాంకు              2.01 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top