ఈ ఏడాది మార్కెట్లు 9 శాతం అప్‌!

BOA Securities Estimates Market Will Jump 9 percent In current Year - Sakshi

డిసెంబర్‌కల్లా నిఫ్టీ 19,100 స్థాయిలో 

ముడిచమురు ధరలతో ర్యాలీకి దెబ్బ 

డిజిన్వెస్ట్‌మెంట్‌తో సెంటిమెంటుకు జోష్‌ 

బీవోఏ సెక్యూరిటీస్‌ తాజా అంచనాలు  

ముంబై: గత క్యాలండర్‌ ఏడాది(2020) మధ్యలో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ల రికార్డుల ర్యాలీ ఈ ఏడాది కొనసాగకపోవచ్చని విదేశీ బ్రోకింగ్‌ కంపెనీ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా పేర్కొంది. కొత్త ఏడాది(2022)లో పలు దిద్దుబాట్లకు లోనయ్యే వీలున్నదని అభిప్రాయపడింది. వెరసి ఓ మాదిరి లాభాలకు మాత్రమే ఆస్కారమున్నట్లు అంచనా వేసింది. నిలకడైన ర్యాలీకి పలు డౌన్‌సైడ్‌ రిస్కులున్నట్లు ఒక నివేదికలో తెలియజేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు ఈ ఏడాది 9 శాతం లాభపడే వీలున్నట్లు పేర్కొంది. డిసెంబర్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 19,100 పాయింట్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. అయితే బీఎస్‌ఈ ఇండెక్స్‌.. సెన్సెక్స్‌ అంచనాలను వెల్లడించలేదు. నివేదికలోని ఇతర వివరాలు చూద్దాం.. 

అక్టోబర్‌ వరకూ 
2020 జూన్‌లో ప్రారంభమైన మార్కెట్‌ ర్యాలీ 2021 అక్టోబర్‌వరకూ కొనసాగింది. ఈ బాటలో 2022లోనూ ర్యాలీ కొనసాగే అవకాశాలు తక్కువే. వెరసి ఈ ఏడాది మార్కెట్లు 9 శాతం వరకూ పుంజుకునే వీలున్నదని బ్రోకింగ్‌ సంస్థ రీసెర్చ్‌ నిపుణులు అమిష్‌ షా అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌కల్లా నిఫ్టీ 19,100 పాయింట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. నిఫ్టీ ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే 28 శాతం ప్రీమియంతో ఉన్నప్పటికీ దేశీ ఈక్విటీలు ఆకర్షణీయంగానే ఉన్నట్లు తెలియజేశారు. రిటర్నుల విషయంలో తైవాన్‌ తదుపరి నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త వేరియంట్లతో పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు, స్టాక్స్‌ను సైతం దెబ్బతీసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ అదపునకు కేంద్ర బ్యాంకులు లిక్విడిటీ కట్టడికి ప్రణాళికలు వేస్తున్నాయి. దీంతో బలపడుతున్న డాలర్‌.. రూపాయిసహా ఇతర కరెన్సీలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలియజేశారు. 

రేట్ల పెంపు 
షా అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది జూన్‌ నుంచి యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచే ప్రణాళికల్లో ఉంది. 0.25 శాతం చొప్పున ఏడాది చివరికల్లా నాలుగుసార్లు రేట్ల పెంపును చేపట్టవచ్చు. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 77కు బలహీనపడే వీలుంది. మరోవైపు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ముడిచమురు ధరలు బ్యారల్‌కు 120 డాలర్లను తాకే అవకాశముంది. తదుపరి సగటున 85 డాలర్లకు చేరవచ్చు. ఇది ప్రధానంగా ఈ ఏడాది మార్కెట్‌ ర్యాలీని దెబ్బతీసే వీలుంది. ఇలాంటి స్వల్పకాలిక పరిస్థితులు మార్కెట్లలో పలుమార్లు దిద్దుబాట్లకు దారిచూపవచ్చు. అయితే ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రయివేట్‌ పెట్టుబడులకు అవకాశాలు పెంచడంతో మార్కెట్లు బలపడే అవకాశముంది. ప్రభుత్వ దిగ్గజాలలో ప్రయివేట్, విదేశీ పెట్టుబడులకు వీలు కల్పించడం ఇందుకు సహకరించవచ్చు. రైల్వేలు, బొగ్గు మైనింగ్, విమానాశ్రయాలు, రక్షణ, గ్యాస్, విద్యుత్‌ గ్రిడ్లు తదితర విభాగాలలో ప్రయివేట్‌ పెట్టుబడులకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలకు తెరతీసే వీలుంది. 2025కల్లా 80 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఈ బాటలో విద్యుదుత్పత్తి, ప్రసారం, టెలికం, వేర్‌హౌసింగ్, గ్యాస్, పెట్రోలియం పైప్‌లైన్లు, పోర్టులు, పట్టణ రియల్టీ తదితర రంగాలలో ప్రయివేట్‌ పెట్టుబడులు ప్రవహించే అవకాశముంది.
 

చదవండి: మిడ్‌క్యాప్స్‌లోనూ డెరివేటివ్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top