బ్యాంకులకు కష్ట కాలమే

Bad Days For Banks In India Soon - Sakshi

సమీప కాలంలో క్లిష్టమైన వాతావరణం

ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా 

న్యూఢిల్లీ: భారత బ్యాంకులు సమీప కాలంలో క్లిష్టమైన నిర్వహణ వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, రుణ ఆస్తులపై ఒత్తిళ్లు, రుణ మాఫీలు పెరగడం వంటి వాటిని ప్రస్తావించింది. ద్రవ్యపరమైన సహకారానికి పరిమిత అవకాశాలే ఉన్నట్టు అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం, కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున సాధారణ కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. రుణ నష్టాలు పరిమితంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ‘‘కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా సమస్యాత్మక రుణాలను ఒక్కసారి పునర్‌నిర్మాణానికి ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతించింది.

దీంతో మొండి బకాయిల గుర్తింపు (ఎన్‌పీఏలు), వాటికి కేటాయింపుల పరంగా బ్యాంకులకు ఉపశమనం లభించింది. అయితే, ఇలా పునరుద్ధరించిన రుణాలు భవిష్యత్తులో సరిగ్గా వసూలు కాకపోతే బ్యాంకులపై అధిక ఎన్‌పీఏల భారం పడుతుంది’’ అంటూ ఫిచ్‌ తన నివేదికలో వివరించింది. ఆర్‌బీఐ డేటాను పరిశీలిస్తే.. 2013–14 నుంచి 2018–19 మధ్య భారత బ్యాంకులు 85 బిలియన్‌ డాలర్ల (రూ.6లక్షల కోట్లకు పైగా) రుణాలను మాఫీ చేసినట్టు తెలుస్తోందని, ఇందులో 80 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నాయని తెలిపింది.  

ఈ విడత ప్రభావం ఎక్కువే 
‘‘ఈ సారి ఆర్థిక సమస్యలు మరింత విస్తృతంగా, లోతుగా ఉండనున్నాయి. కనుక రుణాల పునర్నిర్మాణం అనేది పెద్ద సవాలే. నిర్వహణ సమస్యలు ఎక్కువ’’ అని ఫిచ్‌ పేర్కొంది. 2022 సంవత్సరం తొలి త్రైమాసికం వరకు భారత జీడీపీ కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో జీడీపీ మైనస్‌ 10.5 శాతానికి క్షీణించి.. 2021–22లో 11 శాతానికి పుంజుకోవచ్చని పేర్కొంది.

2021లో ఐటీలో అధిక వృద్ధి..
భారత ఐటీ సేవల రంగం 2021–22లో అధిక సింగిల్‌ డిజిట్‌ ఆదాయ వృద్ధి స్థాయికి చేరుకుంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. డిజిటల్‌ టెక్నాలజీలకు మారే విషయమై అధిక డిమాండ్‌ వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. భారత ఐటీ సేవల రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఈ రంగంపై ప్రభావం స్వల్ప కాలమే ఉంటుందని, అది కూడా మోస్తరుగానేనని తెలిపింది. కస్టమర్లు తమ వ్యాపారాలను డిజిటల్‌గా నవీకరించుకునేందుకు.. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. చాలా కంపెనీలు బలమైన డీల్స్‌ను సొంతం చేసుకున్నాయని.. అవి 2021–22లో వృద్ధికి తోడ్పడతాయని అంచనా వేసింది. భారత ఐటీ రంగం తక్కువ నిర్వహణ వ్యయాల అనుకూలతతో.. అంతర్జాతీయ ఐటీ విభాగంలో బలమైన స్థానాన్ని కొనసాగిస్తుందని ఫిచ్‌ అంచనా వేసింది. నూతన హెచ్‌1బీ, ఎల్‌1బీ వీసాలపై అమెరికా నిషేధ ప్రభావం అధిగమించతగినదేనని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top