డిసెంబరు 2న ఆనంద్‌ రాఠీ వెల్త్‌ ఐపీవో

All Is Ready For Anand Rathi Wealth IPO - Sakshi

ధర శ్రేణి రూ. 530–550 

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల గ్రూప్‌ ఆనంద్‌ రాఠీలో భాగమైన ఆనంద్‌ రాఠీ వెల్త్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) డిసెంబర్‌ 2న (రేపు) ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 6న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 530–550గా ఉంటుంది. ఈ ఐపీవో ద్వారా ఆనంద్‌ రాఠీ వెల్త్‌ రూ. 660 కోట్లు సమీకరించనుంది. కనీసం 27 షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్లు విక్రయించనున్నారు. ఆనంద్‌ రాఠీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సుమారు 92.85 లక్షల షేర్లు.. ప్రమోటర్లు ఆనంద్‌ రాఠీ, ప్రదీప్‌ గుప్తా, అమిత్‌ రాఠీ తదితరులు 3.75 లక్షల షేర్లు విక్రయిస్తున్నారు. ఇష్యూలో 2.5 లక్షల షేర్లను ఉద్యోగుల కోసం కేటాయించారు. 2002లో ఏర్పాటైన ఆనంద్‌ రాఠీ వెల్త్‌ సంస్థ.. మ్యూచువల్‌ ఫండ్‌ల పథకాలు, ఇతర ఆర్థిక సాధనాల విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2019 మార్చి 31 నుంచి 2021 ఆగస్టు 31 మధ్య కాలంలో సంస్థ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎ) సుమారు 23 శాతం వార్షిక వృద్ధితో రూ. 30,209 కోట్లకు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top