TDS: మీరు ఉద్యోగస్తులా.. ఫాం16, ఫాం16ఏ గురించి మీకు తెలుసా?

What is Form 16, Form 16A, Form 16B for salaried employees - Sakshi

టీడీఎస్‌ అంటే మూలం వద్ద చెల్లింపులోనే కోత అని అర్థం. చెల్లింపులు జరిపే వ్యక్తి చట్టప్రకారం కొంత మొత్తం పన్నుగా మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా రికవరీ చేసిన మొత్తాన్ని సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, సకాలంలో రిటర్నులు దాఖలు చేసి, ఒక స్టేట్‌మెంటును తయారు చేస్తారు. వీటినే టీడీఎస్‌ స్టేట్‌మెంట్లు అంటారు. ఇందులో ఆదాయం వివరాలు, వాటి స్వభావం, కొంత కోసిన మొత్తం, చలానా వివరాలు, అస్సెస్సీ పేరు, పాన్, అసెస్‌మెంటు సంవత్సరం మొదలైన వివరాలు ఉంటాయి. జీతాలు చెల్లించేటప్పుడు ఇచ్చిన ఫారంని 16 అని, ఇతర చెల్లింపులకు ఇచ్చిన ఫారం 16ఏ అని అంటారు. 

డిపార్ట్‌మెంటు వారు అన్నింటినుండి సేకరించిన సమాచారంతో ప్రతి అస్సెస్సీకి ఒక సమగ్రమైన పట్టికను తయారు చేస్తారు. దీనినే 26సీ అని అంటారు. ఇందులో అస్సెస్సీకి సంబంధించిన ఆదాయ వివరాలు, టీడీఎస్, టీసీఎస్, అస్సెస్సీ చెల్లించిన పన్ను వివరాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇదొక చిట్టా అని చెప్పవచ్చు. అయితే ఫారం 16/16ఏ లోని వివరాలు, ఫారం 26ఏ లోని వివరాలు ఒకదానితో మరొకటి సరిపోవాలి. తేడాలు రాకూడదు. అయితే, ఎన్నో సందర్భాల్లో తేడాలు ఉంటున్నాయి. వివిధ కారణాలు ఏమిటంటే.. 

  డిడక్ట్‌ చేసిన వ్యక్తి చెల్లించకపోవడం
 
  ♦రిటర్నులు నింపినప్పుడు తప్పులు దొర్లడం
 
  ♦పాన్‌ నంబరు రాయడంలో తప్పులు
 
 ♦టాన్‌ నంబర్‌ రాయడంలో తప్పులు
 
 ♦ చలాన్ల వివరాల్లో తప్పులు దొర్లటం
 
 అసెస్‌మెంటు సంవత్సరాన్ని తప్పుగా రాయటం
 
 ♦  అడ్రస్‌లు తప్పుగా రాయడం 

 అస్సెస్సీ పేర్లు తప్పుగా రాయడం 

 పూర్తి వివరాలు ఇవ్వకపోవడం 

 పన్నుల మొత్తం రాయడంలో తప్పులు, హెచ్చుతగ్గులు దొర్లడం..
 
ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. అందుకే తేడాలు రావచ్చు. 

ఇప్పుడు ఏం చేయాలి? 
ఇలా తేడాలు గమనించినప్పుడు ఫారం 16, ఫారం 16ఏ జారీ చేసిన వారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వారిని సంప్రదించి ఆ తప్పులు సరిదిద్దించుకోవాలి. డిపార్ట్‌మెంటు వారికి తగిన కారణాలు వివరిస్తూ జవాబు ఇవ్వండి. వ్యత్యాసాలని సమన్వయం చేయండి. అంటే ‘‘రీకన్సిలేషన్‌’’ చేయండి. వివరణ సరిగ్గా ఉంటే ఏ సమస్యా ఉండదు.  

తీసుకోవలసిన జాగ్రత్తలు 
ఇప్పుడు ప్రీఫిల్డ్‌ ఫారాలు ఉన్నాయి. ఈ సదుపాయం వల్ల ఫారం 26ఏ లోని అంశాలు యథాతథంగా ప్రీఫిల్డ్‌ ఫారంలో ఉంటాయి. ఇటువంటప్పుడు తేడాలు కనబడితే వాటిని వెంటనే సరిదిద్దండి. డిడక్టర్‌ ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వకపోయినా ఇబ్బందే. డిమాండు  ఏర్పడే అవకాశం ఉంటుంది. సరిదిద్దండి. వీటివల్ల ఆలస్యం కావచ్చు. అయినా తప్పదు. ఇలాంటి తప్పులు దొర్లినప్పుడు సరిదిద్దుకునేందుకు అస్సెస్సీలకు డిపార్ట్‌మెంటు అధికారులు సరైన అవకాశం, సమయం ఇవ్వాలి. 26ఏ లో తప్పుడు సమాచారాన్ని బట్టి అసెస్‌మెంట్‌ జరిగితే ఆ చర్య మీద అప్పీలుకు వెళ్లవచ్చు. ఈ మధ్య ఒక కంపెనీ అసెస్‌మెంటులో కోట్ల రూపాయల తప్పు దొర్లితే ఆ తప్పుని సరిదిద్దారు. కాబట్టి జాగ్రత్త వహించండి. అన్నింటికీ కీలకం.. మీ దగ్గరున్న సరైన, నిజమైన సమగ్రమైన సమాచారం. అదే శ్రీరామరక్ష.

చదవండి: Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్‌?

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top