‘ఉపాధి’ ప్రాణసంకటం.. | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ప్రాణసంకటం..

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

● వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న కూలీలు ● తగిన ఏర్పాట్లు చేయాలని వేడుకోలు

● వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న కూలీలు ● తగిన ఏర్పాట్లు చేయాలని వేడుకోలు

బూర్గంపాడు: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురై మృతి చెందుతున్న ఘటనలు కూడా జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఎండల తీవ్రతకు వడదెబ్బతో తొలుత కొంత అస్వస్థతకు గురై ఆ తరువాత పరిస్థితులు విషమిస్తున్న ఘటనలున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రాంతంలో ఎండల నుంచి రక్షణకు ఎలాంటి వసతులు లేకపోవటం వడదెబ్బకు ప్రధాన కారణమవుతోంది. పనిచేసిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు లేకపోవటం, తాగునీరు ఏర్పాటు చేయకపోవటం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్లు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న తరుణంలో కూడా వసతులపై ఈజీఎస్‌ అధికారులు దృష్టి పెట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది.

ఫొటోల మధ్య వ్యవధి తగ్గించాలి..

ఉపాధి హామీ పనుల నిర్వహణలో మార్పులు చోటుచేసుకోవటంతో కూలీలను రెండుసార్లు పనిప్రాంతంలో ఫొటోలు తీయాల్సి వస్తోంది. పనులు ప్రారంభించేటప్పుడు పనిప్రాంతంలో కూలీలను తొలుత ఫొటో తీయాలి. పని పూర్తయి ఇంటికి వెళ్లేటప్పుడు మళ్లీ ఫొటో తీయాలి. రెండు ఫొటోలు తీసేందుకు మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండాలి. రెండు ఫొటోలు తీసిన తరువాత ఆ ఫొటోలను ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే కూలీలకు వేతనాలు అందుతాయి. లేకుంటే పనిచేసిన వేతనాలు అందవు. ఎండల తీవ్రత కారణంగా తెల్లవారుజామున 5 గంటల నుంచే కూలీలు పనులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పనిప్రాంతానికి వెళ్లే సరికి ఉదయం 6 గంటలవుతోంది. అప్పట్నుంచి నాలుగు గంటల పాటు పనిచేస్తేనే రెండవసారి ఫొటో తీసుకునేందుకు అనుమతులుంటాయి. కూలీలు ఎంత తొందరగా పనులకు వెళ్లినా ఉదయం 10 గంటల తరువాతనే రెండో సారి ఫొటో తీసుకునే అవకాశాలుంటాయి. మూడురోజులుగా ఎండల తీవ్రత మరీ ఎక్కువైంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండుటెండల్లో కూలీలు రెండుగంటల పాటు పనులు చేయటంతో వడదెబ్బకు గురవుతున్నారు. పనిప్రాంతం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చే సరికి 11.30 అవుతోంది. కూలీలు ఇంటి నుంచి తీసుకెళ్లిన తాగునీరు వేడెక్కడంతో తాగలేకపోతున్నారు. వేడెక్కిన నీళ్లు తాగి కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఫొటోలు తీసే మధ్యలో వ్యవధిని తగ్గించాలని కూలీలు కోరుతున్నారు. పనిప్రాంతంలో టెంట్లు, చల్లటి తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement