పిట్‌లైన్‌పై పట్టింపేది ? | - | Sakshi
Sakshi News home page

పిట్‌లైన్‌పై పట్టింపేది ?

Dec 9 2025 9:18 AM | Updated on Dec 9 2025 9:18 AM

పిట్‌లైన్‌పై పట్టింపేది ?

పిట్‌లైన్‌పై పట్టింపేది ?

● టెర్మినల్‌ స్టేషన్‌గా భద్రాద్రి కొత్తగూడెం ● జిల్లా మీదుగా మూడు కొత్త లైన్లు ● భద్రాచలంరోడ్‌లో రైలు నిర్వహణ సౌకర్యం ● నానాటికీ పెరుగుతున్న పిట్‌లైన్‌ అవసరం

● టెర్మినల్‌ స్టేషన్‌గా భద్రాద్రి కొత్తగూడెం ● జిల్లా మీదుగా మూడు కొత్త లైన్లు ● భద్రాచలంరోడ్‌లో రైలు నిర్వహణ సౌకర్యం ● నానాటికీ పెరుగుతున్న పిట్‌లైన్‌ అవసరం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతంలో నడిచిన రైళ్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త రైళ్లు నడిపించేందుకు వీలుగా భద్రాచలం రోడ్‌లో ‘రేక్‌’ నిర్వహణ కోసం ఆధునిక పిట్‌లైన్‌ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైలు నిర్వహణ సౌకర్యాలు మెరుగుపడితే దాని తాలూకూ ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తానికి ఉపయోగపడే అవకాశం ఉంది.

కొత్త రైళ్ల కొరత..

తెలంగాణ నుంచి తిరుపతి, షిర్డీ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్తున్న భక్తుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి తిరుపతికి రైలు కావాలనే డిమాండ్‌ అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు గతంలో అనేక సార్లు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్‌, ఖమ్మం నుంచి రోజుకు మూడు రైళ్లు తిరుపతికి ఉన్నందున భద్రాచలంరోడ్‌ నుంచి కొత్త రైలు అవసరం లేదని, మంచిర్యాల స్టేషన్‌లో రైలు నిర్వహణకు సరిపడా మౌలిక సదుపాయాలు లేనందున అక్కడి నుంచి తిరుపతికి రైలు నడిపించలేమని రైల్వే బోర్డు నుంచి సమాధానాలు వస్తున్నాయి. దశాబ్దాల తరబడి రైల్వే పరంగా సికింద్రాబాద్‌, ఆ తర్వాత కొద్దో గొప్పో కాజీపేట మినహా మరే స్టేషన్‌ కూడా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది.

మౌలిక సదుపాయాలేవి..?

సాధారణంగా ఒక రైలుకు ఉపయోగించే బోగీలన్నింటిని కలిపి రేక్‌ అంటారు. ఈ రేక్‌లో ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై నాలుగు వరకు బోగీలు ఉంటాయి. సాధారణంగా ఈ బోగీలు మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఒకసారి సాధారణ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అవి తిరిగి ప్రయాణానికి అనువుగా ఉంటాయి. గతంలో సింగరేణి రైలు మెయింటెనెన్స్‌ భద్రాచలంరోడ్‌ స్టేషన్‌లో ఉండేది. ఇందు కోసం స్టేషన్‌ ఆవరణలో 14 బోగీల సామర్థ్యం కలిగిన పిట్‌లైన్‌ కూడా నిర్మించారు. కాలక్రమేనా సింగరేణి రైలు నిర్వహణ భారం కాజీపేటకు తరలిపోయింది. అప్పటి నుంచి రైలు రేక్‌ల మెయింటెనెన్స్‌ విషయంలో భద్రాచలం రోడ్‌ స్టేషన్‌కు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో కాజీపేట – మణుగూరు ప్యాసింజర్‌, బెళగావి ఎక్స్‌ప్రెస్‌లు నడిపించడం లేదని రైల్వేశాఖ పైకి చెబుతున్నా, ఆయా రైళ్ల నిర్వహణకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ లేకపోవడమే అసలు కారణం.

భద్రాచలం రోడ్‌ కీలకం

మణుగూరు – రామగుండం రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.4వేల కోట్లతో రైల్వే శాఖ డీపీఆర్‌ సిద్ధం చేసింది. దీని నిర్మాణం పూర్తయితే బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గానికి మరో ప్రత్యామ్నాయ లైన్‌ అందుబాటులోకి వస్తుంది. భద్రాచలం – మల్కన్‌గిరి (ఒడిశా) కొత్త లైన్‌ను కేంద్రం 2024 ఆగస్టులో మంజూరు చేసింది. ఈ మార్గంలో 173 కిలోమీటర్ల మేరకు కొత్త లైన్‌ నిర్మించనున్నారు. ఇక కొత్తగూడెం – కిరోండల్‌ మధ్య దూరం 180 కిలోమీటర్లుగా ఉంది. ఈ లైన్‌ నిర్మాణానికి ఇప్పటికే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే పూర్తయింది. ఇవి కాకుండా డోర్నకల్‌ – భద్రాచలం రోడ్‌ – మణుగూరు లైన్‌ ప్రస్తుతం సింగిల్‌ నుంచి డబ్లింగ్‌గా అప్‌గ్రేడ్‌ అవుతోంది. భద్రాచలంరోడ్‌ – సత్తుపల్లి మార్గం కూడా ప్రారంభం కాగా, దీన్ని కొవ్వూరు వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇందులో సగం ప్రాజెక్టులు మొదలైనా.. దక్షిణ మధ్య రైల్వేలో భద్రాచలంరోడ్‌ స్టేషన్‌ కీలకంగా మారుతుంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్తర తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్ల నిర్వహణ కోసం భద్రాచలంరోడ్‌లో 24 బోగీల సామర్థ్యంతో కొత్త పిట్‌లైన్‌ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా స్థానిక పార్లమెంట్‌ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement