నేడు తెలగాణ తల్లి విగ్రహావిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): స్థానిక ఐడీఓసీలో మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికా రులు, అనధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సూక్ష్మ పరిశీలకుల
పాత్ర కీలకం
ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మైక్రో అబ్జర్వర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పోలింగ్‌కు ముందురోజే పరిశీలకులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రతి దశలోనూ నిశితంగా పర్యవేక్షిస్తూ, ఎన్నికల నియమావళి అమలుతీరును అంచనా వేసి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సాయికృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి
ఉత్తమ అవార్డు
దుమ్ముగూడెం : దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో నాన్ భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న దుమ్ముగూడెం మండల ఐఈఆర్పీ సతీష్‌కు జిల్లా స్థాయి ఉత్తమ ఇంక్లూజివ్ టీచర్ అవార్డు దక్కింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆయన సోమవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులకు తాను అందిస్తున్న సేవలకు గాను ఉత్తమ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు.
‘ఐఈఎల్‌టీఎస్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన ఐఈఎల్‌టీఎస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు, స్కాలర్‌షిప్ పొందేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్హులైన వారు టీజీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ www. tgbcstudycircle. cgg. gov. in ద్వారా ఈ నెల 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08742–227427, 94419 31359, 96521 61850, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.


