గాడిన పడని రైళ్లు ! | - | Sakshi
Sakshi News home page

గాడిన పడని రైళ్లు !

Dec 7 2025 8:51 AM | Updated on Dec 7 2025 8:51 AM

గాడిన పడని రైళ్లు !

గాడిన పడని రైళ్లు !

గత డిసెంబర్‌లో

బెళగావి ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కాజీపేట ప్యాసింజర్‌కు

రేక్‌ షేరింగ్‌ సమస్య

సత్తుపల్లికి ప్యాసింజర్‌ రైలు వెళ్లేది ఎప్పుడో..

జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్న రైళ్లివే..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్త లైన్ల సంగతి దేవుడెరుగు.. జిల్లాకు కనీసం కొత్త రైళ్ల మంజూరులోనూ ఆ శాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. చివరకు గతంలో నడిచిన రైళ్లను పునరుద్ధరించేందుకు సైతం మీనమేషాలు లెక్కిస్తోంది.

బెళగావికి ఏడాది

మణుగూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా కర్ణాటకలోని కొల్హాపూర్‌ వరకు 2017లో రైలు ప్రారంభించారు. సాయంత్రం వేళ బయలుదేరే ఈ రైలు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌, 11 గంటలకు లింగంపల్లికి చేరుకునేది. ఐటీ సెక్టార్‌లో పని చేస్తున్న వారికి ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉండేది. కానీ కరోనా కాలంలో ఈ రైలు రద్దయింది. అనంతరం 2023 జనవరిలో కొల్హాపూర్‌ రైలు స్థానంలో మణుగూరు – సికింద్రాబాద్‌ – బెళగావి రైలు ప్రారంభించారు. అయితే, ఈ రైలు నడిపించిన సమయంలో కాజీపేట – డోర్నకల్‌ – విజయవాడ మధ్య మూడో లైన్‌ నిర్మాణ పనులు జరగడంతో రాకపోకలు కష్టంగా సాగాయి. దీంతో కొన్నాళ్లు మణుగూరు నుంచి, ఆ తర్వాత భద్రాచలం రోడ్‌ నుంచి నడవగా.. మూడో లైన్‌ పనుల పేరుతో రెండు నెలలు కాజీపేట వరకే పరిమితమైంది. ఇలా ఆగుతూ సాగుతూ నడిచిన బెళగావి రైలును రద్దు చేస్తున్నట్లు 2024 డిసెంబర్‌ 18న రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలును పునఃప్రారంభించాలని అటు కర్నాటక, ఇటు తెలంగాణకు చెందిన ప్రయాణికుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయాన్ని రైల్వే బోర్డుకు నివేదించారు. అయితే నేటికీ ఈ అంశంపై రైల్వే బోర్డు ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోంది.

కుంటిసాకులే..

భద్రాచలం రోడ్‌ స్టేషన్‌ మీదుగా ప్రస్తుతం కాకతీయ, సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, విజయవాడ ప్యాసింజర్‌ నడుస్తున్నాయి. వీటితో పాటు మణుగూరు నుంచి సూపర్‌ఫాస్ట్‌ రైలు కూడా ఉంది. కరోనాకు ముందు ఈ మూడు రైళ్లతో పాటు భద్రాచలంరోడ్‌ – డోర్నకల్‌, మణుగూరు – కాజీపేట ప్యాసింజర్‌ రైలు కూడా నడిచేది. ఇందులో కాకతీయ రైలుతో సమానంగా ఆదరణ కలిగిన సర్వీసుగా మణుగూరు – కాజీపేట ప్యాసింజర్‌కు గుర్తింపు ఉండేది. ఉదయం మణుగూరులో బయలుదేరి మధ్యాహ్నం కాజీపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం అక్కడ బయలుదేరి రాత్రికి మణుగూరు చేరుకుంటుంది. ఈ ప్యాసింజర్‌కు ఉపయోగించే రేక్‌ (రైలు పెట్టెలు)నే కాకతీయ ప్యాసింజర్‌కు కూడా ఉపయోగించేవారు. అయితే కరోనా సమయంలో ఈ రైలు రద్దయింది. ఆ తర్వాత కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ రేక్‌ షేరింగ్‌ మారిపోయింది. దీంతో మణుగూరు – కాజీపేట ప్యాసింజర్‌ రైలు పునరుద్ధరణ డోలాయమానంలో పడింది.

హామీ ఆ ఒక్క రైలుకే..

కరోనాకు ముందు డోర్నకల్‌ – భద్రాచలం రోడ్‌ మధ్య ఉదయం – సాయంత్రం వేళలో తిరిగే ప్యాసింజర్‌ రైలును పునఃప్రారంభిస్తామని రైల్వే శాఖ హామీ ఇస్తోంది. వాస్తవానికి మణుగూరు – కాజీపేట ప్యాసింజర్‌తో పోల్చితే ఈ రైలుకు ఆదరణ తక్కువ. కానీ, డోర్నకల్‌ ప్యాసింజర్‌పై ఉన్న శ్రద్ధ కాజీపేట ప్యాసింజర్‌పై చూపడం లేదు. మణుగూరు – కాజీపేట రైలుకు రేక్‌ షేరింగ్‌ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు మణుగూరు – కాజీపేట రైలును పెద్దపల్లి – కరీంనగర్‌ మీదుగా నిజామాబాద్‌ వరకు పొడిగించే అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించడం లేదు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నుంచి నిజామాబాద్‌ వెళ్లేందుకు ప్రస్తుతం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే అందుబాటులో ఉంది. అది కూడా చుట్టూ తిరిగి వెళుతోంది. మణుగూరు నుంచి నిజామాబాద్‌ వరకు కొత్త రైలు అవసరమని ప్రయాణికులు అంటున్నారు.

పశువులకు నిలయంగా..

భద్రాచలంరోడ్‌ – సత్తుపల్లి మార్గంలో గూడ్సు రైళ్లు మొదలై రెండేళ్లు దాటినా ఇప్పటికీ ప్రయాణికుల రైలు పట్టాలెక్కలేదు. దీంతో ఈ మార్గంలో నిర్మించిన చండ్రుగొండ, భవన్నపాలెం వంటి స్టేషన్లు పశుపక్షాదులకు నిలయంగా మారుతుండడంతో పాటు చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. జిల్లా నుంచి తిరుపతి, షిర్డీలకు రైళ్లు నడిపించాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా అమలుకు నోచడం లేదు.

జిల్లాకు ఐదు అవసరం..

ఒక్కదానికే హామీ

మణుగూరు – బెళగావి

మణుగూరు – కాజీపేట

భద్రాచలంరోడ్‌ – డోర్నకల్‌

భద్రాచలంరోడ్‌ – సత్తుపల్లి

భద్రాచలంరోడ్‌ – తిరుపతి/షిర్డీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement